కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్
రాష్ట్రానికి రావొచ్చు
అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి
లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్‌పై
ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం
పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో వ్యాక్సిన్
ధ్రువప్రతం తప్పనిసరి చేస్తాం టీకా వేసుకోకపోవడం ఆత్మహత్యాసదృశం : డిహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మూడో ముప్పుపై వస్తున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయని తెలిపారు. ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధిగా మాస్కులు ధరించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు లేకుండా కనిపించే వారికి రూ. 1,000 జరిమానా విధించాలని పోలీస్ శాఖకు సూచించినట్టు వెల్లడించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ అనుమతితో కఠిన నిబంధనలు రూపొందించనున్నట్టు డిహెచ్ స్పష్టం చేశారు. హోటల్, రెస్టారెంట్, పార్కులు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు వ్యాక్సిన్ వేసుకున్న ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేయనున్నామని పేర్కొన్నారు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కూడా అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు. టీకా తీసుకోని వారిని భవిష్యత్తుల్లో పబ్లిక్ ప్రదేశాలకు అనుమతించబోమని అన్నారు.
కొత్త వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువగా వ్యాప్తి
ఒమిక్రాన్ డెల్టా రకం కంటే ఆరు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తోందని డీహెచ్ అన్నారు. కేవలం మూడు రోజుల్లోనే మూడు నుంచి 24 దేశాలకు విస్తరించిందని గుర్తు చేశారు. ఒమిక్రాన్ నివారణకు ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కొత్త వేరియంట్ కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే.. జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్‌లోకి రావొచ్చని డీహెచ్ అన్నారు. బుధవారం రోజున యుకె, సింగపూర్ నుంచి వచ్చిన 325 ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తే అందులో ఒక మహిళకు పాజిటివ్ వచ్చిందని ఆమెను టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని చెప్పారు. సదరు మహిళకు ఒమిక్రాన్ సోకిందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు.
మనం అప్రమత్తంగా ఉండి ఒమిక్రాన్‌ను కట్టడి చేదాం
ఒమిక్రాన్ ముప్పు త్వరలో తెలంగాణకూ వ్యాపించవచ్చని, మనం చాలా అప్రమత్తంగా ఉండి దాన్ని కట్టడి చేద్దామని డీహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్త వేరియంట్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించే ప్రమాదముందని అన్నారు. అందుకే టీకా రెండు డోసులు తీసుకోని వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఒమిక్రాన్ మూడు రోజుల్లో 3 దేశాల నుంచి 26 దేశాలకు విస్తరించిందని అన్నారు. వైరస్ ముప్పు నుంచి మనం బయటపడేందుకు మన చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం వ్యాక్సిన్ మాస్కులేనని అన్నారు. ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, అందుకే ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమని, దానికంటే 6 రెట్లు వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వైరస్‌ను ముప్పును ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పనిసరి అని, వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆత్మహత్యతో సమానమని డీహెచ్ వ్యాఖ్యానించారు. వైరస్ ఎదుర్కోవడంలో ప్రజలు ప్రభుత్వానికి, ఆరోగ్య అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి పని చేస్తేనే కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా చేయగలమని అన్నారు. రాష్ట్రంలో మొదటి డోసు తీసుకుని రెండో డోసు టీకా తీసుకోని వాళ్లు 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నట్టు డీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా … 47 శాతం మందికి రెండు డోసులూ అందించినట్లు వివరించారు. గతంలో కరీనా విజృంభణతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు బాధపడ్డారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.