ఇప్పటికి 30 దేశాల్లో కోరలు చాచింది
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ దావానలంలా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధి లోనే ఈ వేరియంట్ దాదాపు 30 దేశాలకు వ్యాపించింది. డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియంట్ భారత్ లోనూ వెలుగు చూడడం కలకలం రేపుతోంది. నవంబర్ 24న తొలిసారి దక్షిణాఫ్రికా లోని గుటాంగ్ ప్రావెన్సుతోపాటు బోట్స్‌వానా అనే రెండు దేశాల్లో ఒకే రోజు ఈ వేరియంట్ బయటపడడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. నవంబర్ 26 న దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డబ్లుహెచ్‌ఒ ప్రకటించింది. ఆ రోజు నెదర్లాండ్, ఇజ్రాయెల్, హాంగ్‌కాంగ్, బెల్జియం దేశాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్ 27 న ఆస్ట్రేలియాతోపాటు చెక్ రిపబ్లిక్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్ మొత్తం ఐదు దేశాలకు వ్యాపించింది. నవంబర్ 28న డెన్మార్క్, ఆస్ట్రియాలోను, నవంబర్ 29న కెనడా, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలకు విస్తరించింది. డిసెంబర్ 1న అత్యధికంగా బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, నార్వే, ఐర్లాండ్, అమెరికా, ఘనా, యుఎఇ, నైజీరియాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా డిసెంబర్ 2 న భారత్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.