దక్షిణాఫ్రికా వైద్య నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఓ లక్షణాన్ని దక్షిణాఫ్రికాలో వైద్య నిపుణులు గుర్తించారు. ఆ దేశానికి చెందిన డిస్కవరీ హెల్త్ సీఈవొ రేయాన్ నోచ్ మాట్లాడుతూ ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్పంగా విభిన్న లక్షణాలు బయటపడుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా వైరస్ సోకిన వారికి తొలిదశలో గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, కనిపిస్తున్నాయని, ఇలాంటి లక్షణాలే యుకెలో ఒమిక్రాన్ బాధితుల్లో కూడా ఉన్నాయని వివరించారు. అక్కడి వారిలో తలనొప్పి, అలసట, వంటి లక్షణాలు అదనంగా కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.
యూకెలో డిసెంబర్ 3 నుంచి 10 వ తేదీ మధ్య జరిగిన విశ్లేషణలో వీటిని గుర్తించారు. ఇలాంటి లక్షణాలే సహజంగా జలుబులో కూడా కనిపిస్తాయి. ఇక యూకె లోని జో సిమ్టమ్ ట్రాకింగ్ స్టడీలో కొన్ని లక్షణాలు గుర్తించారు. ముక్కు కారడం, తలనొప్పి, వంటి లక్షణాలు స్వల్పంగా లేదా తీవ్రంగా ఉంటున్నట్టు తేలింది. అంతేకాదు, తుమ్ములు, గొంతునొప్పి కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. డెల్టా సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచివాసన కోల్పోవడం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వంటివి కనిపించాయి. జో కొవిడ్ స్టడీ ప్రధాన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ సోకిన వారికి జలుబు లక్షణాలే ఎక్కువగా ఉంటున్నట్టు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. బూస్టర్ డోసులు తీసుకొన్న వారిలో అతి స్వల్ప లక్షణాలతో కొవిడ్ సోకినట్టు గమనించామని తెలిపారు.