Monday, December 23, 2024

గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఓమ్నికామ్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

ఆ సంస్థ సీనియర్ ప్రతినిధి బృందంతో న్యూయార్క్‌లో మంత్రి కెటిఆర్ సమావేశం
ఈ కేంద్రం ఏర్పాటుతో 2500మంది యువకు ఉపాధి అవకాశాలు

మన తెలంగాణ/ హైదరాబాద్:  అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రఖ్యాత ఓమ్నికామ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ క్యాపిటల్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం మంత్రి తారక రామారావు న్యూయార్క్ నగరంలో ఓమ్నికామ్ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని ప్రకటించడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత మే నెలలో సంస్థతో జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ కేంద్రం ఏర్పాటు కోసం కంపెనీకి విజ్ఞప్తి చేశామన్నారు. హైదరాబాదు నగరంలో మీడియా అనుబంధ రంగాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరుల నైపుణ్యాన్ని, మౌలిక వసతుల అంశాన్ని వివరించామని గుర్తు చేశారు. దీంతోపాటు కంపెనీ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్లకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపామని, మీడియా అనుబంధ రంగాల్లో ఇన్నోవేషన్, వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ దిశగా ఓమ్నికామ్ సంస్థ ప్రకటన ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.

ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 2500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఇది తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని తెలియజేశారు. భారతదేశంలో పాటు అంతర్జాతీయంగా అనేక ఇతర నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంస్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జైద్ ఆల్ రషీద్ తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాలు 100 దేశాల్లో కొనసాగుతున్నాయని, ఇదే దిశగా భారత దేశంలోనూ తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు సహకరిస్తుందన్నారు. ఈ కేంద్రం కార్యకలాపాల ద్వారా తమ సంస్థ మీడియా రంగంలో తమ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా అనుకున్న వృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత మే నెల కాలం నుంచి నిరంతరం తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వయంగా మంత్రి కార్యాలయం నుంచి ఈ గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం నిరంతరం ఫాలో అప్ ( చర్చలు) కొనసాగిందని తెలిపారు. తమ సంస్థ గ్లోబల్ కాబబిలిటీ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News