హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన (మంగళవారం) నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన కూడళ్లలు,పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర ప్రదేశాలలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లు, పోలీసు కమిషనర్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
సంబంధిత గ్రామ పంచాయతీలలో, స్థానిక మున్సిపల్ వార్డులు, ట్రాఫిక్ జంక్షన్‌లలో సామూహిక గానం కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా ప్రదేశాలలో నోడల్ అధికారులను నియమించి, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా 16న ఉదయం 11.30 గంటలకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని , జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా, అత్యంత క్రమశిక్షణతో జాతీయ గీతం ఆలపించాలని ఆయన తెలిపారు
అన్ని ఛానెళ్లలో జాతీయ గీతం ప్రసారం..
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16న నిర్వహించే సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాలను వివిధ ఛానెళ్లల్లో ప్రసారం చేయాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కోరింది. ఈ మేరకు మీడియా సంస్థల సిఈఓ,ఎండి, శాటిలైట్ ఛానెళ్ల ప్రతినిధులకు సమాచారం అందజేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.