Sunday, December 22, 2024

25న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సచివాలయ గుడి, చర్చి, మసీదు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సచివాలయ గుడి, చర్చి, మసీదు ఈనెల 25వ తేదీన ప్రారంభించుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లే విధంగా ప్రార్ధన మందిరాలు నిర్మాణం జరగాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, అందులో భాగంగా గతంలో ఉన్న వాటికంటే అద్భుతంగా ఈ మందిరాల నిర్మాణాలు జరిగాయని ఆయన తెలిపారు. డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి నిర్మాణ ఫినిషింగ్ వర్క్‌ను శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గుడి, మసీదు, చర్చి నిర్మాణ ప్రాంగణాలు ఆయన కలియతిరిగారు.

మిగిలిన చివరి దశ పనులు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 2300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందని, పనులన్నీ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయని, వాటి పనులు అన్ని పూర్తయ్యాయని ఆయన తెలిపారు. దేవాలయానికి సంబంధించిన విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నామన్నారు. యాగంతో ఈ ఆలయాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.

మసీదు, చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో వారి మతాచారం ప్రకారం ప్రారంభించుకుంటామన్నారు. తెలంగాణ అంటేనే గంగా, జమునా, తేహజిబ్ అని సర్వమత సమ్మేళితమన్నారు. అందుకే కెసిఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ గతంలో ఉన్న దానికంటే అద్భుతంగా వీటిని నిర్మించారని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కాలే యాదయ్య, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.మధు శేఖర్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, డిఈ లు దుర్గా ప్రసాద్, మోహన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రైతు నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News