Monday, December 23, 2024

27న ఖమ్మంలో రైతు విధానం ప్రకటిస్తాం

- Advertisement -
- Advertisement -

రైతులను మోసం చేస్తున్న బిఆర్‌ఎస్ గద్దె దింపే వరకు పోరాటం
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మంలో జరిగే ‘రైతు గోస, బిజెపి భరోసా’ వేదిక ద్వారా.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. అన్నదాతల సంక్షేమానికి సంబంధించి చేపట్టబోయే అంశాలను ప్రస్తావించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో హోంశాఖమంత్రి అమిత్ షా పాల్గొనే ‘రైతు గోస, బిజెపి భరోసా’ వేదిక ద్వారా రాష్ట్రంలో బిజెపి రైతు విధానాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. రైతుబంధు మాత్రమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదన్నారు. రైతులను అన్నిరకాలుగా మోసం చేస్తున్న బిఆర్‌ఎస్ సర్కారును, కౌలు రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని కెసిఆర్ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. సమగ్ర పంట బీమా పథకాన్న అమలు చేయకుండా రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రైతు రుణమాఫీని తెరపైకి తీసుకొచ్చి.. రైతులను ఆగమాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నాలుగున్నరేండ్ల కింద ఇచ్చిన రుణాలకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రుణాలు రెట్టింపయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోందని, ధాన్యం సేకరణ మొదలుకుని, యూరియా సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థికంగా చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టి.. విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదు..
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హత బిఆర్‌ఎస్‌కు లేదని.. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానంగా చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒకమాట బిఆర్‌ఎస్ నేతలది.. వాస్తవాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళాబిల్లు ప్రవేశ పెడితే.. ఆ బిల్లు పేపర్లను చించేసి నానా హంగామా చేసిన నాయకుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఇంటికి పిలిచి.. భోజనాలు పెట్టి చర్చలు జరిపిన విషయం ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు.
జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటారు..
నిన్న చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడం 140 కోట్లమంది భారతీయులకు గర్వకారణమన్న కిషన్ రెడ్డి.. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన.. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తాచాటడం.. తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పుష్ప సినిమాతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా స్టేటస్‌ను పెంచిన అల్లు అర్జున్.. ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌కు, చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం.. ఉత్తమ ప్రజాదరణ కలిగిన చిత్రంగా ఎంపికవడం పట్ల.. చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు జూనియన్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తేజ్ తోపాటు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ అవార్డులను పొందిన వారందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News