న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఇప్పటి నిషేధం సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది. విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆదివారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌తో తలెత్తిన పరిస్థితితో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020 మార్చి 23 నుంచి రద్దు చేశారు. ప్రత్యేకంగా అనుమతించిన విమానాలలోనే నిర్ధేశిత కారణాలతో ప్రయాణాలు పరిమితంగా సాగుతున్నాయి. ఇప్పటికీ వివిధ దేశాలలో కరోనా పరిస్థితిని సమీక్షించుకుని ఇప్పటి నిషేధాన్ని పొడిగించాలని నిర్ణయించినట్లు డిసిజిఎ తెలిపింది. అయితే నిర్ణీత మార్గాలలో సంబంధిత అధీకృత సంస్థలు, ప్రయాణ కారణాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమానాలను కొన్నింటిని నడిపించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
ఇప్పుడు వందేభారత్ మిషన్ పరిధిలో కొన్ని దేశాలతో ఉన్న ఎయిర్ బబుల్ అవగావహన క్రమంలో అంతర్జాతీయ విమానాలు కొన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో భారత ప్రభుత్వం 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో అమెరికా, బ్రిటన్, యుఎఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపిస్తూ వస్తున్నారు. అయితే సరుకుల రవాణా విమానాలు, ప్రత్యేక అనుమతి పొందే విమానాల నిర్వహణ విషయంలో ఎటువంటి బ్రేక్ ఉండబోదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) వెలువరించిన సర్కులర్‌లో తెలిపారు.