Sunday, November 24, 2024

కవిత అరెస్టుపై.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కన్నెర్ర చేశారు. కవిత అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. బస్సు డిపోల ముందు బిఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెయ్యి మంది మోదీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేకుండా ఎంఎల్‌సి కవిత బయటకు వస్తారని గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ నేతలు రోడ్లపై బైఠాయించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిజామాబాద్ పట్టణంలో జెడ్‌పి చైర్మన్ విఠాల్ రావు ధర్నాలో పాల్గొన్నారు. సిద్దిపేట పాత బస్టాంట్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యకర్తలు చేపట్టారు. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మీర్‌పేటలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసి .. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బోరబండ బస్టాండ్ వద్ద ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలతో హోరెత్తించారు. ఇల్లందు పట్టణంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అశ్వారావుపేట రింగురోడ్డు సెంటర్‌లో పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఎంఎల్‌సి కవిత అరెస్ట్‌కు నిరసనగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి నేతృత్వంలో పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నా నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News