Saturday, November 23, 2024

అనాథ చిన్నారులకు ఆర్థిక, విద్యాలబ్దికి సుప్రీం సూచనపై…

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం స్పందన తెలుపాలి : బిహెచ్‌ఎస్‌ఎస్

మన తెలంగాణ / హైదరాబాద్ : కొవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కల్పిస్తున్న మాదిరిగానే ఆర్థిక, విద్యా లబ్ధిని దేశంలోని అనాథ చిన్నారులందరికీ కల్పించాలన్న సుప్రీం సూచనపై తెలంగాణ ప్రభుత్వం తమ స్పందన సుప్రీంకోర్టుకు తెలుపాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరిందన్నారు. తల్లిదండ్రులను ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోయినా ఆనాథలు, అనాథలేనని ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని బాలల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డా. గుండు కిష్టయ్య, ఇంజమూరి రఘనందన్ గుర్తు చేశారు.

కొవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకున్నట్లుగానే దేశంలోని అనాథ బాలలందరికీ అండగా నిలవాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపిందన్నారు. పిఎం కేర్స్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 2(డి) ద్వారా విద్యావకాశాలు కల్పించడం వంటి మంచి విధానాలను కొవిడ్ బాధితుల కోసం కేంద్రం తీసు కువచ్చిందని, అటువంటి చేయూతను దేశంలోని అనాథ చిన్నారులు అందరికీ వర్తింపజేసే విషయాన్ని కూడా పరిశీలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించిందన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రంజీత్ బెనర్జీని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించిందన్నారు. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించిందన్నారు.

విద్యా హక్కు చట్టం కింద అనాథ చిన్నారులకు విద్యావకాశాలను కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్పందనలను తెలపాలని ధర్మాసనం ఆదేశించిందన్నారు. కొవిడ్‌లో తల్లి దండ్రులను కోల్పోయిన వారికి కల్పించిన ప్రభుత్వ పథకాల సదుపాయాలను అనాథలకు కూడా వర్తింపజేయాలని కోరుతూ పిపి శుక్ల దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. తమ అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించినట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News