రన్ ఫర్ పీస్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ భార్య పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు బిఆర్‌ఎస్ నాయకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ రూ.15 లక్షల విరాళాన్ని అందించారు. గాంధీ జయంతి సందర్బంగా ‘రన్ ఫర్ పీస్’ 3వ ఎడిషన్‌ని బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహించింది. రన్ ఫర్ పీస్ లో భాగంగా 10కె, 5కె, 3కె రన్ నిర్వహిం చారు. రన్‌ని జెండా ఊపి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌ఎ గాంధీ, ఎఫ్.డి.సి. ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వాకర్స్ అసోయేషన్ అధ్యక్షుడు భరత్ రెడ్డిలు ప్రారంభించారు. రన్‌లో 2500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఎంపి సంతోష్‌కుమార్ గాంధీ జయం తిని పురస్కరించుకుని దేహదారుఢ్యానికి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను కొనియాడారు. రన్ ఫర్ పీస్ వంటి సంఘటనలు ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రజలను చైతన్యవంతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్యాక్రాంతం అయ్యే ఈ బొటానికల్ గార్డెన్ కెసిఆర్ వల్లే ఇంత బాగుందన్నారు. ఇక్కడున్న ప్రతి చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. రాష్ట్రం మొత్తం థీమ్ పార్క్స్ ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎంపి సంతోష్‌కుమార్ సహకారంతో పాటు గార్డెన్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గాంధీ రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎఫ్‌డిసి చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి, బొటా నికల్ గార్డెన్ ప్రెసిడెంట్ భరత్‌రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ, సింగరేణి డైరెక్టర్ బలరాం, అటవీశాఖ అధికారులు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుండి కరుణాకర్ రెడ్డి, రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మాగాంధీ విగ్రహానికి ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌ఎ గాంధీ, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్‌రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.