న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం బయటపడింది. ఈ స్కామ్ వెనుక రాయ్‌పూర్ మేయర్ ఏజాబ్ దేభర్ సోదరుడు అన్వర్ దేభర్ కీలక పాత్ర ఉన్నట్టు తేలింది. దీంతో అక్రమ నగదు చలామణి చట్టం (పిఎంఎల్‌ఎ) కింద శనివారం అర్ధరాత్రి రాయ్‌పూర్ లోని ఓ హోటల్‌లో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ స్కామ్ ద్వారా నిందితులకు రూ. 2 వేలకోట్లు లభించాయని ఆరోపించింది. ఆ రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసా నుంచి అన్వర్ అక్రమంగా డబ్బు వసూలు చేశారని పేర్కొంది.
ఏడు సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ పేర్కొంది. తరచూ సిమ్ కార్డులు మారుస్తున్నాడని చెప్పింది. ఈ నేపథ్యంలో హోటల్ వెనుక డోర్ నుంచి అన్వర్ తప్పించుకోడానికి ప్రయత్నించగా అధికారులు అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్ లోని ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం 20స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలుస్తోంది.
ఈ ప్రక్రియలో కొంతమంది అధికారుల సహకారంతో బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు అన్వర్ తన అధీనం లోకి తెచ్చుకున్నాడని ఈడీ వెల్లడించింది. మద్యం సరఫరా కంపెనీల నుంచి కేస్‌పై రూ.75 నుంచి రూ.150 వరకు కమిషన్ వసూలు చేసేవాడు. ప్రైవేటుగా నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లో వాటిని విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. ఈ విధంగా 2019 నుంచి 2022 వరకు సుమారు రూ. 1200 కోట్లు నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించాడని ఈడీ గుర్తించింది. 2022లో ఐఎఎస్ అధికారి అనిల్ తుటేజా పై ఐటీ శాఖ దాడులతో ఈ స్కామ్ బయటపడింది.