ప్రతి 36 మందిలో ఓ పసికందు విషాదకథ
న్యూఢిల్లీ : దేశంలో శిశుమరణాలు తల్లులకు కడుపుకోతను రగిల్చి, ఆరోగ్య వ్యవస్థ దుస్థితిని తెలియచేస్తున్నాయి. దేశంలో పుట్టన ప్రతి 36 మంది పసికందులలో ఒక్క శిశువు తన తొలి పుట్టిన రోజు కూడా చవిచూడకముందే కన్నుమూస్తోంది. ఇది ప్రతి వేయి మంది లెక్కన చూస్తే సగటున 22 గా ఉంటోంది. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనిని శిశుమరణాల సూచీ (ఐఎంఆర్)గా వ్యవహరిస్తారు.
ఈ సూచీ సభ్య సమాజానికి సిగ్గుచేటే. ఇప్పటికి శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందనే విషయం దేశంలో మొత్తం మీద దిగజారిన ఆరోగ్య రంగ పరిస్థితికి ప్రతీక అయ్యింది. దేశ దిగజారుడు ఆరోగ్య పరిస్థితిని ఈ ఐఎంఆర్ క్రూరసూచితో లెక్కచూసుకోవడం జరుగుతూనే ఉంది. ఏడాదిలోపు ప్రాయపు పసికందుల మరణాలు ప్రతి వేయి మందిలో ప్రాంతాలు నిర్ణీత కాలంలో ఏ మేరకు ఉన్నాయనేది ప్రాతిపదికగా చేసుకుని ఈ శిశు మృతి స్థాయిని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈ శిశు మరణాలు అంటే ఏడాది ప్రాయానికి ముందు లోకాన్ని సరిగ్గా చూడని దశలోనే చనిపోయే శిశువుల సంఖ్య వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆప్ ఇండియా ఐఎంఆర్ రిపోర్టుగా వెలువరించింది. 2020 సంవత్సరంలో వేయి మంది లెక్కన చూస్తే 22 మంది శిశువులు కళ్లు తేలేశారు.
1971లో ఈ విషాదపరిణామం వేయి మందికి 129 మంది పసికందులుగా ఉండేది. గత పది సంవత్సరాలలో శిశుమరణాల సంఖ్య గణనీయంగానే తగ్గింది. జాతీయ స్థాయిలో ఐఎంఆర్ సూచీ ప్రకారం చూస్తే 36 శాతం వరకూ తగ్గుదల ఉన్నట్లు నిర్థారణ అయింది. గ్రామీణ ప్రాంతాలలో ఇది ఇంతకు ముందు వేయికి 48 ఉండగా ఇప్పుడు 31కి చేరింది. ఇదే పట్టణ ప్రాంతాలలో ఇంతకు ముందు 29 ఉండగా ఇది ఇప్పుడు 19 అయిందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో గ్రామీణ పట్టణ తేడాల విషయానికి వెళ్లకుండా పరిశీలిస్తే ఐఎంఆర్ ఇప్పుడు ప్రతి 30 మంది శిశువులలో ఒక శిశు మరణంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఏటా లక్షలాది శిశువులు తమ తొలిపుట్టినరోజుకు ముందుగానే గిట్టిపోయి, కాలగర్భంలో కలిసి పోతోందని వెల్లడైంది.