డిసిఎంను ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
హనుమాన్ ఆలయం వద్ద సంఘటన
హైదరాబాద్: లారీ బీభత్సం సృష్టించిన సంఘటన ఉప్పల్‌లోని ఎన్‌జిఆర్‌ఐ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్ర వారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మృతిచెందగా, ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటనలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం….తెల్లవారుజామున 6.15గంటలకు బ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న డిసిఎంను ఢీకొట్టింది. దీంతో డిసిఎం వ్యాన్ పక్కన ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలోకి దూసుకెళ్లింది. డిసిఎం పక్కన నుంచి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు బంజారాహిల్స్‌కు చెందిన రాంచందర్(42) ప్రహరీ, డిసిఎం మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. రాంచందర్ శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. ప్రమాదం సమయంలో లారీ పక్కన నుంచి వెళ్తున్న టాటా ఏస్ వాహనం తాకడంతో అది మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కొండన్న, సత్తమ్మ, మరో మహిళ, డిసిఎం డ్రైవర్ రమేష్, లారీ డ్రైవర్ లక్ష్మినారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం తాగి నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఆలంయం కార్యాలయం, ప్రహరీ దెబ్బతిన్నది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆలయంలో భక్తులు పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లారీ, డిసిఎం ఘటనలో సికింద్రాబాద్, ఉప్పల్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను సంఘటన స్థలం నుంచి తీసివేశారు. డోర్లు కట్ చేసి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.