ఇంఫాల్ : మణిపూర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్‌లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి కుల ఘర్షణల నడుమనే మణిపూర్‌లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతున్నారు. పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ సమాచారం నిర్థారణ చేసుకుని పోలీసు కమాండోల బృందం ఆదివారం రాష్ట్రంలోని నలు మూలాల పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టింది. ఈరోజే ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్‌కౌంటర్లు జరిగినట్లు, దాదాపు 40 మంది వరకూ వేర్పాటువాదులను ఈ దశలో మట్టుపెట్టినట్లు తమకు సమాచారం అందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం విలేకరులకు తెలిపారు.
ఇప్పుడుదాడులకు దిగుతున్నది కుకీ మిలిటెంట్లుగా భావించడం లేదని, దాడులకు దిగుతున్న వారు ఉగ్రవాదులని సిఎం చెప్పారు. ఉగ్రవాదులు ఇప్పటి అశాంతిని ఆసరాగా చేసుకుని పలు చోట్ల ఎం 16, ఎకె 47లతో తిరుగుతున్నట్లు, వీటిని స్నిప్పర్ గన్స్‌ను వాడుకుంటూ పౌరులపై కాల్పులు జరుపుతున్నట్లు వెల్లడైంది. వారు అనేక గ్రామాల్లోకి చొరబడి, ఇళ్ల విధ్వంసానికి, తగులబెట్టడానికి వ్యూహాలు పన్నినట్లు తేలిందని విలేకరులకు బీరెన్‌సింగ్ తెలిపారు. వెంటనే వీరికి వ్యతిరేకంగా సైన్యం, ఇతర భద్రతా బలగాల సాయంతో ఆపరేషన్ ఆరంభించినట్లు , ఇప్పటికైతే 40 మంది వరకూ ఉగ్రవాదులను ఏరివేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా నిరాయుధులైన జనంపై కాల్పులకు దిగుతున్నారు.
ఇప్పుడు ఈ విధ్వంసక ఆలోచనలతో ఉన్న ఉగ్రవాదులకు , కేంద్రం వెన్నుదన్నులతో కదులుతున్న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరు సాగుతోందని ప్రకటించారు. రాష్ట్రంలో కుకీలకు , మైతీ వర్గాలకు మధ్య నెలకొన్న వివాదానికి ఇప్పుడు సాయుధులు కాల్పులకు దిగడానికి సంబంధం లేదని, కేవలం మణిపూర్‌ను ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలని, లేదా జాతీయ స్థాయిలో కల్లోల సంకేతాలు రేకెత్తించడానికి ఇప్పుడు ఇక్కడ ఉగ్రవాదులు ప్రవేశించారని బీరెన్ సింగ్ తెలిపారు. ఆదివారం ఉగ్రవాదులు ఇంఫాల్ లోయలోని ఐదు ప్రాంతాలు, ఇంఫాల్‌లో దాడికి దిగారు. సెక్మయ్, సుగ్నూ, కుంబి, ఫయెంగ్,సిరోవ్‌లలో ఇతర ప్రాంతాలలో ఎదురుకాల్పులు సాగుతున్నాయి. వీధులలో పలు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
అయితే మృతులు ఎవరో నిర్థారించుకోవడానికి వీల్లేకుండా దాడులు కాల్పులు జరుగుతున్నాయని వెల్లడైంది. సెక్మయ్‌లో ఆపరేషన్ ముగిసిందని అధికార వర్గాలు తెలిపాయి. బిషెన్‌పూర్‌లోని చందోన్‌పోక్పిలో ఓ 27 సంవత్సరాల రైతు కుమన్‌తెమ్ కెన్నెడీపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనితో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దశలో పలువురు పౌరులు మృతి చెందినట్లు అనధికారికంగా వెల్లడైంది. మృతి చెందిన రైతుకు భార్య , పసికందు అయిన కొడుకు ఉన్నారు. ఫయెంగ్‌లో గాయపడ్డ పది మందిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించారు.