Thursday, January 23, 2025

సియోనిలో పులి దాడికి ఒకరు మృతి… ఆగ్రహంతో పశువైద్యునిపై గ్రామస్థుల దాడి

- Advertisement -
- Advertisement -

సియోని (ఎంపి): మధ్యప్రదేశ్ సియోని జిల్లా పెంచ్ టైగర్ రిజర్వు(పిటిఆర్) ఫారెస్టు ఏరియాలో ఆదివారం పులి దాడికి ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సమీపాన గల గొండె గ్రామ ప్రజల ఆగ్రహావేశాలకు , చివరకు విధ్వంసానికి దారి తీసింది. పశువైద్యుడు గాయపడడమే కాకుండా ఆరు ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయి. పశువైద్యుడు అఖిలేష్ మిశ్రాను డివిజన్ హెడ్‌క్వార్టర్స్ జబల్‌పూర్ ఆస్పత్రికి చికిత్స కోసం వెంటనే తరలించారు. పులి దాడిలో గాయపడిన ఇద్దరిని కూడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గొండె గ్రామానికి వెంటనే వెళ్లారు. పిటిఆర్ ఏరియాకు ఆనుకుని ఉన్న గ్రామస్థులు పరిసరాల్లో పులి దాక్కుందని చెబుతూ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని పులిని చంపడానికి సిద్ధమయ్యారని ఎఎస్‌పి శ్యామ్‌సింగ్ మారవి చెప్పారు.

పులి దాడి సంఘటన పిటిఆర్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ సింగ్ వివరిస్తూ 55 ఏళ్ల చున్నీలాల్ పాట్లే తన ఇంటి పెరడులో కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లగా పులి దాడి చేసిందని, ఆయన కేకలకు గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని జంతువుల బారి నుంచి రక్షించడంలో అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. పొలంలో దాక్కున్న పులి మరో ఇద్దరిపై దుముకుతూ దాడి చేసిందని చెప్పారు. అటవీ అధికారులు అక్కడకు వెళ్లగానే కోపంతో గ్రామస్థులు ఆరు వాహనాలను ధ్వంసం చేశారని, పశువైద్యుడిపై కర్రలతో కొట్టారని తెలిపారు. ఈలోగా ఎస్‌పి రామ్‌జీ శ్రీవాస్తవ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులిని పట్టుకోడానికి ప్రయత్నం ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News