న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాలలో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేందుకే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింనది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నాయి.
మన వ్యవస్థలో ప్రభుత్వాలు ఉప ఎన్నికలకు వెళ్లడం, కొత్త ప్రభుత్వాలు రావడం జరుగుతుందని, ఈ కారణంగానే భారత్ వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒకే దేశం, ఒకే ఎన్నికల అమలు సాధ్యం కాదని ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. అయితే రాష్ట్రపతి పాలన విధించిన పక్షంలో జమిలిఎన్నికలు సాధ్యపడతాయని, కాని అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ఒకవేళ అదే జరిగితే మన దేశం ప్రజస్వామిక విధానం నుంచి అధ్యక్ష పాలనా విధానానికి మారుతున్నట్లేనని ఆయన చెప్పారు.
జమిలి ఎన్నికలు నిర్వహించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న విషయం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా తెలుసునని, అధ్యక్ష పాలనా విధానానికి మారాలంటే రాజ్యాంగంలో అనేక సవరణలు తీసుకురావలసి వస్తుందని ప్రశాంత్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేదని, ఈ వాస్తవాలన్నీ ప్రభుత్వానికి తెలుసునని, అందుకే ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలలో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలన్న ఏకైక లక్షంతోనే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అన్న ఆచరణకు సాధ్యంకాని ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు.
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఖాయమని బిజెపి భయపడుతోందని, అందుకే ఒకే దేశం, ఒకే ఎన్నికల సాకుతో వచ్చే ఏడాది జరగవలసి ఉన్న సార్వత్రిక ఎన్నికల వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని భావిస్తోందని ప్రశాంత్ చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాలలోకేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.