Saturday, November 23, 2024

మోడీ జమిలి స్పీడ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ దిశలో కేంద్ర ప్రభుత్వం ఓ అడుగుముందుకేసింది. ఏకకాల లేదా ఒకే దేశం ఒకే ఎన్నికలు (ఒఎన్ ఓయి) లేదా జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 16 మంది సభ్యులు ఉంటారని వెల్లడైంది. దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపడం, వీటిని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహించే జమిలి ప్రక్రియ ఏ మేరకు సాధ్యం? దీని వల్ల సౌలభ్యతలు ఏమిటీ? సంక్లిష్టతలు ఏ విధంగా ఉంటాయి? అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. 1967 వరకూ ఉన్న లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల ఏకకాల ప్రక్రియకు తిరిగి వెళ్లడం ఇప్పుడు సాధ్యమేనా? ఇందుకు అవసరం అయిన ప్రక్రియలు, యంత్రాంగం పద్ధతుల గురించి ఈ కీలక కమిటీ పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు.

కమిటీ సారధ్యానికి కోవింద్ ఆమోదం తెలిపినట్లే అని భావిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి జమిలి విషయంలో నిపుణులను, రాజ్యాంగ అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. వివిధ రాజకీయపార్టీల నేతలతో కూడా మాట్లాడుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 18 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు క్రితమే ఉన్నట్లుండి నిర్ణయించింది. అజెండాలేకుండా దీనిని ప్రకటించారు. ఈ భేటీలోనే జమిలి ఎన్నికల బిల్లు తీసుకువచ్చేందుకు కేంద్రం సంసిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ దశలోనే ఇప్పుడు కమిటీ ఏర్పాటు జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ జమిలికి పోవడం మంచిదని చెపుతూ వచ్చారు. కేవలం లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికలే కాకుండా స్థానిక సంస్థలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు తరచూ వచ్చిపడే ఎన్నికల తాకిడి ఉండదని, పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందని, వేర్వేరు ఎన్నికల వల్ల తలెత్తే వ్యయానికి విరుగుడు అవుతుందని ప్రధాని చెపుతూ వస్తున్నారు.

తరచూ ఎన్నికలతో కోడ్‌లు రావడం , దీనితో పరిపాలనా బ్రేక్, ప్రగతి పనులు ఆగిపోవడం దేశానికి నష్టదాయకం అని చెపుతున్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఆయన 2017లో దేశ రాష్ట్రపతి అయ్యారు. 2018లో పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఏకకాల ఎన్నికలు మంచిదని తెలిపారు. తరచూ ఎన్నికలు రావడం నష్టదాయకం అన్నారు. మానవ వనరులపై భారం పడుతుంది. దృష్టి పక్కదోవ పడుతుంది. దీని గురించి ఆలోచించాల్సి ఉందని ఆయన మోడీ తరహాలోనే మాట్లాడారు. ఇప్పుడు ఆయనకు జమిలి కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించారు.
ఆ రాష్ట్రాలకు లోక్‌సభకు గుండుగుత్తా ఓటు ?
దేశంలో వచ్చే ఏడాది మే లేదా జూన్ మధ్య లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే పలు పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలకు తమ సాధనాసంపత్తిని సిద్ధం చేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించడం లేదా వీటితో పాటే లోక్‌సభ ఎన్నికలను చేపట్టి, జమిలికి శ్రీకారం చుట్టడం మోడీ సర్కారు ఆలోచన అని వెల్లడైంది. ఇటీవలి చర్యతీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే దిశలోనే ఉన్నాయని ప్రతిపక్షాలు ఘంటాపథంగా చెపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News