న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుత న్యాయ పరిపాలన పరిధిలో మార్పులు చేసేందుకు ప్రజల నుంచి సూచనలను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక దేశం, ఒకే ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఆహ్వానించింది. జనవరి 15లోగా వచ్చే సూచనలను పరిశీలిస్తామని ఈ ఉన్నత స్థాయి కమిటీ శనివారం ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ప్రజలు తమ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌కు లేదా ఈమెయిల్‌కు పంపవచ్చని నోటీసులో తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది. జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఉభయులకు ఆమోదయోగ్యమైన తేదీని సూచించాలని కోరుతూ ఇటీవలే రాజకీయ పార్టీలకు కమిటీ లేఖలు కూడా రాసింది. పార్టీలకు దీనిపై రిమైండర్లు కూడా పంపింది. ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలకు, ఏడు రిజిస్టర్ చేసుకున్న గుర్తింపులేని పార్టీలకు కమిటీ లేఖలు పంపింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ స్వీకరించింది.