Thursday, January 23, 2025

యూనిఫామ్ కాదు, సంస్కరణలు!

- Advertisement -
- Advertisement -

పోలీసులు అందించే సేవల గురించి అటు ప్రభుత్వమూ, ఇటు పోలీసు అధికారులు లోతుగా ఆలోచించడం లేదు. దానికి బదులుగా, వారి యూనిఫాం మార్పు వంటి పనికిమాలిన విషయాలను ఆలోచిస్తూ తమ శక్తియుక్తులను వృథా చేస్తున్నారు. రక్షణ వ్యవస్థపై 2020 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అప్పటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ రక్షణ రంగాల యూనిఫాంలో తీసుకురావలసిన మార్పుల గురించి ప్రతిపాదించారు. భారత, చైనా సరిహద్దుల్లో రక్షణ బలగాల యూనిఫాం వంటి వ్యక్తిగత విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారి భద్రతకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సంఘటనను జాతీయ పత్రికలు చాలా ప్రాధాన్యతనిచ్చి ప్రచురించాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే యూనిఫాం ఉండాలని గత నెల 28వ తేదీన రాష్ట్రాల హోం మంత్రులతో ఏర్పాటు చేసిన ‘చింతన్ శివార్’ లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక జడత్వ ప్రతిపాదన చేశారు.

కోల్‌కతా పోలీసులు, ముంబయి పోలీసులు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసులు మినహా దేశమంతా పోలీసులకు ఖాకీ యూనిఫాం ఉందన్న విషయం ప్రధానికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మిగతా పోలీసుల కంటే ట్రాఫిక్ పోలీసులు భిన్నమైన డ్యూటీలు నిర్వహిస్తారు. చాలా రాష్ట్రాలో ఉండే ట్రాఫిక్ పోలీసులకు భిన్నమైన యూనిఫాం ఉంది. ఒక రాష్ర్ట పోలీసులకు, మరొక రాష్ర్ట పోలీసులకు మధ్య తేడాను తెలిపే విధంగా వారి టోపీలు, బెల్టులు, భుజాలపైన ఉండే గుర్తులు భిన్నంగా ఉంటాయి. ఈ తేడాలన్నిటినీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు, సాధారణ ప్రజలు గుర్తించలేకపోయినప్పటికీ, వారి ఖాకీ దుస్తులు మాత్రమే ప్రభుత్వ అధికారంగా గుర్తింపు పొందుతోంది. వివిధ రాష్ట్రాలోని వాతావరణం, భూ భౌతిక పరిస్థితులు, వారు నిర్వహించే కర్తవ్యాలు భిన్నంగా ఉండడం వల్ల ఒకే యూనిఫాం ఉండాలనడం ఆచరణ రీత్యా సాధ్యం కాదు. జమ్ము, కశ్మీర్, లడక్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఉండే శీతల వాతావరణం కంటే మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. కనుక, వారి యూనిఫాం కూడా భిన్నంగా ఉంటుంది. పచ్చని చెట్లతో నిండిన కొండ ప్రాంతాలకు అనుకూలంగా అక్కడి పోలీసులకు పట్టీలాగూలుంటాయి.

ఒకే కేంద్రం నుంచి యూనిఫాం సరఫరా కాదు కనుక, ఒక రాష్ర్టంలో ఉండే పోలీసులకు కూడా ఒకే యూనిఫాం ఇవ్వడం సాధ్యం కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోలీసుల యూనిఫాం ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనుగోలు చేస్తారు. అందుచేత వాటి రంగు, నాణ్యత వంటి వన్నీ రాష్ర్టమంతా కూడా ఒకే రకంగా ఉండడం సాధ్యం కాదు. కేంద్ర రక్షణ బలగాల యూనిఫాం కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడంతో వారికి కూడా ఈ సమస్య ఎదురవుతోంది. రంగు, దారపు నాణ్యత తప్ప రక్షణ దళాల్లో ఉండే వారి యూనిఫాం కూడా ఒకే విధంగా లేదు. భారత ఆర్మీ రెజిమెంట్‌లో ప్రత్యక్షంగా పోరాడే వారికి, వారికి సహాయపడే వారికి మధ్య తేడా కోసం వారి శిరస్త్రాణాలు, బెల్టులు, బ్యాడ్జీలు కూడా భిన్నంగా ఉంటాయి. అన్ని రాష్ట్రాల పోలీసులకు ఒకే యూనిఫాం ఉండడం వల్ల నిందితులను అరెస్టు చేయడానికి వారు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారు పలానా రాష్ట్రాల పోలీసులని గుర్తించడం చాలా కష్టం. అలా గుర్తించలేనప్పుడు అది దుర్వినియోగానికి దారి తీస్తుంది. అలా దుర్వినియోగానికి దారి తీసిన సంఘటనలు ఇటీవల అనేకం జరిగాయి.

ఈ విషయాలన్నిటినీ గమనించకుండా ప్రధాని నరేంద్ర మోడీ పోలీసులకు ఒకే యూనిఫాం ఉండాలని అమాయకంగా వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వ్యవస్థకు సంబంధించిన విషయాలన్నీ రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయని, వారి యూనిఫాం విషయంలోకూడా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలనే విషయం ప్రధాని పదవి చేపట్టిన వారికి తెలిసి ఉండాలి. రాష్ట్రాల హోం మంత్రులు కూడా ఒకే యూనిఫాం ఉండాలన్న విషయం చర్చించే కంటే చర్చించాలన్న అనేక ముఖ్యమైన ఉన్నాయి. పోలీసు సంస్కరణలు చేపట్టి తీరాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను, వాటి అమలు గురించి ఇలాంటి వేదికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించినట్టయితే చాలా బాగుండేది. ఇలాంటి మేధో మథన సదస్సుల్లో రాజకీయ జోక్యం లేకుండా పోలీసు వ్యవస్థ ఎలా స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలో, ప్రజల దృష్టిలో ‘పాలకుల పోలీసుల’ గా కాకుండా, ‘ప్రజల పోలీసులు’గా ఎలా మలచాలో చర్చించినట్టయితే బాగుండేది.

ప్రపంచ ప్రామాణికం ప్రకారం లక్ష మంది ప్రజలకు 152 మంది పోలీసులు ఉండాలి. కేంద్ర సాయుధ భద్రతా బలగాలలతో (సిఎపిఎఫ్) కలిపి కూడా ఈ నిష్పత్తి ఎక్కడా కనిపించడం లేదు. పోలీసు వ్యవస్థలో మానవ వనరుల కొరతను తీర్చడానికి ఆ స్థానాలలో రోజు కూలీల్లాగా హోం గార్డులను నియమిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పోలీసులు చేపట్టే భద్రతా చర్యలు లోపించడానికి ఇదొక ప్రధాన కారణం. ఈ పద్ధతి శాశ్వతంగా కొనసాగకూడదు. ఈ మేధోపరమైన సమావేశాలలో పోలీసులకు శిక్షణ, నైపుణ్యం పెంచాల్సిన విషయాలు చర్చించడం చాలా ముఖ్యమైన విషయం. అతి ముఖ్యమైన పోలీసుల ఆధునీకరణపై దృష్టి పెట్టడానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఆధునికతకు చిహ్నంగా అందమైన వాహనాలు, కంప్యూటర్లు మాత్రం కొనుగోలు చేశారు. పోలీసులకు గృహ సంబంధ సంతృప్తిని కలగచేయడం, అనుకూలమైన పని ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం వంటి వ్యక్తిగత యాజమాన్య పద్ధతులను అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలున్నాయి.

రాజ్యాంగ విధానాలను నిర్లక్ష్యం చేసి, దేశమంతా ఒకే పోలీసు పద్ధతిని ఏర్పాటు చేయాలనే స్పష్టమైన ధ్యేయంతో ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేవి. ప్రతిపక్షాల నోరు మూయించి, వారిని మాట్లాడనీయకుండా చేయడానికి సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిపోయింది. కేంద్రం అదుపు చేసే ఇలాంటి దర్యాప్తు సంస్థలు మరింత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. పోలీసు వ్యవస్థ రాష్ట్రాల జాబితాలోనిదే తప్ప, అది దైవదత్తమైంది కాదు. అదొక మానవ నిర్మితం, ఏమైనా తప్పు జరగవచ్చు. మానవ ధ్యేయాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాం గం చెప్పిన మాటనే చివరి మాటగా స్వీకరించవలసిన అవసరం లేదు. మౌలిక నిర్మాణ సిద్ధాంతం అనేది న్యాయ వ్యవస్థ నిర్మాణం లాగానే కృత్రిమమైనది. భారత ప్రజలమైన మనం ఒక బలమైన కేంద్రం ఉండాలని పునరాలోచించినట్టయితేనే జాతీయ పోలీసు శక్తిని ఏర్పాటు చేయాలి. ఇలాంటివి స్థానిక వ్యక్తులను ఓడించినట్టవుతుందని ఒక వాదన కూడా ఉంది.

కేంద్రీకృత విధానాన్ని అంగీకరించడమంటే దేశంలో భిన్న భాషలు, భిన్న సాంస్కృతులు, భిన్న జాతుల వంటి వైవిధ్యాలున్నాయన్న వాస్తవంతో పాటు, మన రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని నిర్లక్ష్యం చేసినట్టవుతుందన్నది గమనించాలి. ఈ కేంద్రీకృత విధానం వల్ల అఖిల భారత పోలీసు సర్వీసు అధికారులను దేశంలో ఎక్కడైనా నియమించవచ్చు. దీని వల్ల అఖిల భారత అఫీసర్ల కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని వ్యక్తిగతంగా నిర్వహించడం చాల కష్టం. అఖిల భారత పోలీసు అధికారులు రాష్ర్ట, స్థానిక రాజకీయ నాయకుల ద్వారా అవమానానికి గురవుతారు. కేంద్ర అధికారుల నుంచి ఒత్తిడి కూడా రావచ్చు. వాటి ఫలితంగా ఇప్పటికంటే మరింత ఎక్కువగా నియామకాలు, బదిలీలపైన ఎక్కువగా ప్రభావం కలగ చేస్తుంది. ఒకే యూనిఫాం వంటి పనికిమాలిన విషయాలలో చర్చించి సమయాన్ని వృథా చేసే కంటే పోలీసు సేవలు మరింత మెరుగుపడడానికి ఏం చేయాలో లోతుగా ఆలోచించాలి.

రాఘవశర్మ-9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News