స్నేహ్ రాణా
బ్రిస్టోల్: ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందం కలిగించిందని భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా పేర్కొంది. క్లిష్ట సమయంలో జట్టుకు అండగా నిలిచి ఓటమిని తప్పించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా స్కోరు చేయక పోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నానని వివరించింది. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తాను కూడా ఒక దశలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని పేర్కొంది. అయితే శిఖా పాండే, తానియా భాటిగా బ్యాటింగ్ చేసిన తీరు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పింది. జట్టును ఓటమి నుంచి తప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేశానని తెలిపింది. ఇందులో సఫలం కావడం, మ్యాచ్ డ్రాగా ముగియడంతో తన శ్రమ ఫలించిందని స్నేహ్ వ్యాఖ్యానించింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో స్నేహ్ ఈ విషయాలు వెల్లడించింది.