Wednesday, January 22, 2025

అటు చంద్రబాబు అరెస్టు.. ఇటు సిఈసి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

అయోమయంలో టిటిడిపి
ఎన్నికలకు సమయం దగ్గరపడ్డా.. పొత్తులపై తేలని వైనం
ఒంటరిగానే పోటీ చేసినా అభ్యర్థుల ప్రకటన..ప్రచారం ఎప్పుడో మరి?

మన తెలంగాణ / హైదరాబాద్ : ఒక పక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు.. మరో పక్క రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సిఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన విడుదల కావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అయేమయం నెలకొంది. తమ అధినేత బాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషల్ కస్టడీ.. బెయిల్ పిటిషన్లు సహా ముందస్తు బేయిల్‌ను కొట్టి వేస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడంతో ఆ పార్టీలో అయోమయంలో పడింది. అధికార పార్టీ బిఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించి వడివడిగా అడుగులు వేస్తుంటే బాబు అరెస్టు రోజు నుండి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్థబ్దత నెలకొంది. కిందటి నెల 8వ తేదీ అరెస్టు అయిన రోజు నుండి ఆయన్ని విడుదల చేయించుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఈ లోగానే కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ ప్రకటన ఇవ్వడంతో టి టిడిపికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. గత నెల రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ కష్టడీ పిటిషన్‌ను విజయవాడలోని స్థానిక కోర్టు తిరస్కరించడంతో పాటు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతల్లో మరింత ఆందోళన నెలకొంది.

ఈ ఎన్నికల్లో కనీసం పొత్తులు అయినా పెట్టుకుంటారా? లేక సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. టిడిపితో పొత్తు గురించి మీడియా అడుగుతున్నా తెలపని పరిస్థితి. మొన్న కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంతం హైదరాబాద్‌కు వచ్చి ఎన్నికల నిర్వహణపై వాకబు చేసి వెళ్లడంతో ఐదు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ ప్రకటన రావడం ఖాయమని అప్పుడో భావించారు. అనుకున్నట్లుగానే సోమవారం తెలంగాణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కూడా మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై కీలక విషయాలను వెల్లడించడం విశేషం.

కాసాని బస్సు యాత్రపైనా రాని స్పష్టత
కాగా టిడిపిలో మాత్రం చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితులపైనే ఆ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఒక వేళ చంద్రబాబు అరెస్టు కాకుండా ఉండి ఉంటే ఈ పాటికే తెలంగాణలో టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బస్సుయాత్ర చేపట్టి అభ్యర్థులను ఎక్కడికి అక్కడే ప్రకటించి ఆయా నియేజక వర్గాల నుండే ఎన్నికల ప్రచారం చేసి ఉండేవారిని చెబుతున్నారు. ఒక దశలో టిడిపి బస్సు యాత్ర రెండు నెలల కిందటే ఖరారు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే.. యువతపై దృష్టి సారించేందుకు అటు ఏపిలో నారా లోకేష్ ఇన్నాళ్లు పాదయాత్ర చేస్తు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాగా తండ్రి , పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నెల రోజులకు పైగా ఉండడంతో ఆయన్ను విడిపించుకునేందుకు సుప్రింకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిగేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరుచూ ఢిల్లీబాట పడుతున్నారు. ఏది ఏమైనా తమ పార్టీ అధినేతను విడుదల చేయించుకునేందుకు టి టిడిపితో పాటు ఏపి నేతలు వివిధ రకాలుగా ఆందోళనలు చేపడుతున్నారు.

ప్రదర్శనలతో సరి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో మరి
కాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వివిధ పద్దతుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తు వస్తున్నారు. ఒక రోజు మౌన ప్రదర్శన, మరో రోజు గంట కొట్టి ఆవేదన వ్యక్తం చేయడం. ఇంకో రాజు కాగడాలను వెలిగించి నిరసన తెలియజేస్తున్నారు. ఏతా వాతా అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసనల తెలపడంపైనే వారి ధ్యాస ఉంటోంది తప్పితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినా అభ్యర్థుల ప్రకటనపై మాత్రం దృష్టి కేంద్రీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషనే వచ్చాక చూద్దామని అప్పటికి ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News