ట్రంప్ మంత్రి లుట్నిక్ వెల్లడి
వాషింగ్టన్ : ఒక్కొక్కటి 5 మిలియన్ డాలర్ల ధరకు వెయ్యి ఇమ్మిగ్రేషన్ గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా ఒక్క రోజులో 5 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. లుట్నిక్ ‘ఆల్‌ఇన్ పాడ్‌కాస్ట్’లో మాట్లాడుతూ.3.7 కోట్ల మంది కొనుగోలు శక్తిగల కొనుగోలుదారుల్లో పది లక్షల కార్డుల విక్రయం ద్వారా కనీసం 5 ట్రిలియన్ డాలర్లు సమీకరించలమని ట్రంప్ విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. ‘కార్డు కొనగల శక్తి ఉన్నవారు ప్రపంచచంలో 3.7 కోట్ల మంది ఉన్నారు. పది లక్షల కార్డులు అమ్మగలమని అధ్యక్షుడు భావిస్తున్నారు’ అని లుట్నిక్ తెలిపారు. ట్రంప్ ‘గోల్డ్ కార్డుల’ కొనుగోలులో ఆసక్తి ఉన్నవారు 2.50 లక్షల మంది ఉన్నారని అంతకుముందు లుట్నిక్ తెలిపారు.
ప్రస్తుత ఇబి5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో గోల్డ్ కార్డులను అధ్యక్షుడు దాదాపు ఒక నెల క్రితం ప్రకటించారు. గోల్డ్ కార్డు లేదా పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించినట్లుగా ‘ట్రంప్ కార్డు’ ప్రవేశపెట్టాలనే ఆలోచన ఎవరిదని ప్రశ్నించినప్పుడు అది ట్రంప్ ఆలోచన అని, ఇన్వెస్టర్ జాన్ పాల్సన్‌తో సమావేశంలో ఆ ఆలోచన వచ్చిందని లుట్నిక్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ ఆలోచనను అమలు చేయవలసిన బాధ్యత తనదని, ‘దానిని ఎలా అమలు చేయాలో నేను తేల్చుకున్నా’ అని లుట్నిక్ చెప్పారు. ఆ విధంగా సమీకరించిన డబ్బు యుఎస్ జాతీయ రుణభారం తీర్చడానికి ఉపయోగిస్తుందని, ప్రస్తుత రుణ భారం 36.2 ట్రిలియన్ డాలర్లు అని లుట్నిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ప్రధాన ఆలోచన ప్రభుత్వ ఫెడరల్ లోటును తగ్గించడం అని లుట్నిక్ క్రితం నెల ‘ఫాక్స్ న్యూస్’తో ఇంటర్వూలో చెప్పారు. ఒక సందర్భంలో ట్రంప్ గోల్డ్ కార్డును కొనియాడుతూ, ఇది యుఎస్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుందని చెప్పారు.