న్యూఢిల్లీ: ఇద్దరు పైలట్లు, మరో ఏడుగురితో బయలుదేరిన ఒఎన్‌జిసి ( ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) కు చెందిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో పడి నలుగురు చనిపోయారు. నలుగురిలో ముగ్గురు ఒఎన్‌జిసి ఉద్యోగులు. హెలికాప్టర్‌లో ఒఎన్‌జిసి సిబ్బంది ఆరుగురితోపాటు మరొకరు కాంట్రాక్టరు ఉన్నారు. ముంబై తీరం నుంచి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఉండే ఒఎన్‌జిసి సాగర్ కిరణ్ రిగ్‌పై ఆ హెలికాప్టర్ ల్యాండ్ కావలసి ఉండగా రిగ్‌కు సుమారు 1.5 కిమీ దూరంలో సముద్రంలో పడిపోయినట్టు అధికార వర్గాలు తెలియజేశాయి.
ఈ హెలికాప్టర్ పవన్ హాన్‌స సికోర్‌స్కీ ఎస్ 76 కొత్తగా లీజుకు తీసుకున్నారు. హెలికాప్టర్ అదుపు తప్పడంతో బలవంతంగా ఫ్లోటర్స్‌ను ఉపయోగించి కిందకు దించినట్టు తెలుస్తోంది. ముంబై పశ్చిమ తీరానికి 111 కిమీ దూరంలో ఉన్న రిగ్‌పై ల్యాండింగ్ కాడానికి చేసిన ప్రయత్నంలో రిగ్‌పై ల్యాండింగ్ జోన్‌కు 1.5 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రిగ్ సాగర్‌కిరణ్ నుంచి రెస్యూబోటు బయలుదేరి ఒకరిని రక్షించిందని అధికారులు తెలిపారు. తీరం నుంచి రక్షణ చర్యల కోసం మాలవీయ 16 నౌకతోపాటు, మరోనౌక కూడా ముంబై తీరం నుంచి బయలుదేరిందని అధికారులు తెలిపారు. మృతదేహాలను కూపర్ ఆస్పత్రికి తరలించినట్టు జుహు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎకె వర్మ చెప్పారు. డామన్ విమాన స్థావరం నుంచి తమ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ గాలింపు కోసం బయలుదేరిందని, ఒఎస్‌జిసి కూడా హెలికాప్టర్‌ను, నౌకను పంపిందని కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ వీరేందర్ పతానియా మొదట్లో వివరించారు. సముద్ర గర్భంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి చమురు, సహజవాయువులను వెలికి తీయడానికి ఒఎన్‌జిసి అనేక రిగ్గులను ఉపయోగిస్తుంది.
ONGC Helicopter Emergency Landing on Arabian Sea