వారణాసి : కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణం వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే శాంతియుతంగా రెండో రోజు ఆదివారం సాగింది. చాలా వరకు ప్రదాన భాగం పూర్తయిందని చెబుతున్నారు. కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్‌కు మసీదు లోపల వీడియో చిత్రీకరించడానికి కోర్టు ఆదేశాలు లేవని మసీదు యాజమాన్యం అభ్యంతరాలు లేవదీయడంతో గతవారం సర్వే ఆగింది. అయితే సోమవారం కూడా ఈ సర్వే కొనసాగుతుంది. ప్రసిద్ధ చారిత్రక పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాధ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉండటంతో మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ తదితర ప్రతిమలకు పూజలు చేసుకోడానికి అనుమతించాలని గత ఏడాది నలుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మే 10 లోగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని వారణాసి సెషన్స్ కోర్టు ఆదేశించింది. కాశీజ్ఞానవాపి మసీదు వివాదం 1991 నుంచి కోర్టులో నడుస్తోంది. అలహాబాద్ హైకోర్టులో దీనిపై విచారణ సాగుతోంది. ఆదివారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య సర్వే జరిగింది.