క్వింటాలు రూ.400
హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి.గత రెండు నెలల కిందటి దాక క్వింటాలు రూ.4వేలకు పైగానే పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు రూ.400 పలుకు తున్నాయి. ఈ సీజన్‌లో ఉల్లి ధరలు పడిపోవటం ఇదే ప్రధమం అని ఉల్లిసాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు కూడా భారీగానే తగ్గాయి. ఎకరానికి 120క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సివుండగా అందులో సగం దిగుబడి కూడా దక్కటం లేదు.ఎకరానికి 50నుంచి 60 క్వింటాళ్లకు మించటం లేదు. అటు దిగుబడి తగ్గిపోయి, ఇటు మార్కెట్లో ధరలు పడిపోయి రెండు విధాలుగా నష్టపోతున్న రైతులు మరింత కుంగిపోతున్నారు. ఉల్లిసాగు కోసం ఎకరానికి రూ15నుంచి 20వేలకు పైగానే ఖర్చు చేశారు.
కౌలు రైతులు ఎకరానిరి సాగు ఖర్చులతో కలిపి ఎకరం పైన రూ.40వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇంక కష్టపడి పంట సాగుచేసిన రైతులకు మార్కెట్లో ధరలను బట్టి చూస్తే కనీసం పంట కోత కూలీలు కూడా దక్కే పరిస్థితి కనిపించటం లేదంటున్నారు. కూలీ ఖర్చులు భరించినా మార్కెట్‌కు తరలిస్తే రవాణా చార్జీల ఖర్చులు కూడా చేతినుంచే పెట్టాల్సివస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో టోకున క్వింటాలు ఉల్లి ధర రూ.400మించి రైతుకు దక్కకపోగా, అదే ఉల్లి రిటైల్‌గా రూ.15 ధరకు కొంటున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. ఉల్లిపండించిన రైతులకు మిగిలేదేమి లేకపోగా మద్యదళారులు , చిల్లర వ్యాపారులు మాత్రం కమీషన్లు, లాభాలు పండించుకుంటున్నారు.