Sunday, January 5, 2025

ఆన్‌లైన్ ఆసరాతో అక్రమాలు

- Advertisement -
- Advertisement -

అత్యంత ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చి జీవితాలను కొత్తగా ఆవిష్కరిస్తుంటే మరోవైపు ఆ సాధనాలను దుర్వినియోగం చేస్తున్న అక్రమాలు కూడా మితిమీరుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల ఆన్‌లైన్ ఊతంతో సాగుతున్న అఘాయిత్యాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి దాపురించిన తరువాత జీవనశైలి విచిత్రంగా మారింది. అన్నిటికీ డిజిటల్ వినియోగంతో డిజిటల్ ప్రపంచం కొనసాగుతోంది. చదువుకుంటున్న విద్యార్థుల నుంచి వ్యాపారాలు సాగించే వ్యాపారుల వరకు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల నుంచి రుణాల మంజూరు, పెళ్ళిళ్ల సంబంధాల వరకు ఆన్‌లైన్ ఆధారంగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

జీవితాలను సజావుగా సాగించే ఈ అద్భుత ప్రక్రియ ఆనందం కలిగిస్తున్నా మరోవంక జీవితాలను వక్రమార్గం పట్టించే అధ్వాన్న పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మానవ అక్రమ రవాణాకు ఆన్‌లైన్ కూడా వినియోగం కావడం దారుణం. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి బాలబాలికలు, యువతుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతవరకెందుకు? అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎలా గుట్టు రట్టు చేసిందో మనకు తెలిసిందే. మన దేశం వారే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన విదేశీ యువతులు కూడా ఈ రొంపిలోకి కూరుకుపోయారు.

ప్రపంచం మొత్తం మీద ఈ విధంగా ఆన్‌లైన్ దుర్వినియోగంలో భారత్ మొదటి వరుసలో ఉన్నట్టు అధ్యయనంలో బయటపడింది.ప్రపంచం మొత్తం మీద 29.3 మిలియన్ ఫిర్యాదులు ఆన్‌లైన్ దుర్వినియోగంపై రాగా, వాటిలో 4.69 మిలియన్ ఫిర్యాదులు భారత్ నుంచే వచ్చాయని అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సైబర్ టిప్‌లైన్ 2021 నివేదిక విశ్లేషించింది. అన్ని దేశాల కన్నా భారత్‌లోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా సాగుతున్నాయని పేర్కొంది. ఆన్‌లైన్ వినియోగదారులను ఆకర్షించడానికి అక్రమార్కులు ఎన్నో తంత్రాలు వినియోగిస్తున్నారు.

చిట్ చాట్‌తో మాటా మంతీ ప్రారంభమై చివరకు తాము ఏం చెబితే అదే చేసే మానసిక స్థితి పెరిగేలా నమ్మకం కలిగిస్తుంటారు. ఈ చనువు చివరకు బలవంతంగా మానవ అక్రమ రవాణాకు దారి తీస్తోందని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుందర్ క్రిష్ణన్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఊతంతో లైంగిక దోపిడీ సాగించి చివరకు సైబర్ నేరాలకు దారి తీస్తోంది. అధునాతన డిజిటల్ ప్లాట్ ఫారాలైన ఇన్‌స్టంట్ రుణ యాప్‌లు, గేమింగ్ సైట్లు, ఫేక్ వెబ్ సైట్లుతో వినియోగదారులను అక్రమార్కులు ప్రలోభ పెడుతున్నారని “ఎన్‌జిఒ ప్రయత్న” కు చెందిన రాకేష్ తివారీ వివరించారు.

ఆన్‌లైన్ దుర్వినియోగంతో మారుతున్న పరిణామాలపై రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్పేస్ 2 గ్రో అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి వ్యాపించిన దగ్గర నుంచి 44 శాతం మంది ఇంటర్‌నెట్ వినియోగించడంలోనే నిమగ్నమైనట్టు తేలింది. 98 శాతం నెట్ వినియోగదారులు చౌకబారు స్మార్ట్‌ఫోన్లకు ఇంటర్నెట్ అనుసంధానం ఏర్పర్చుకున్నారు. కేవలం చదువుల కోసమే 51 శాతం మంది వినియోగిస్తుండగా, ఈ కామర్స్‌కు 42 శాతం మంది, ఆన్‌లైన్ గేమింగ్‌కు 35 శాతం మంది వినియోగిస్తున్నారని తేలింది. ముఖ్యమైన పనులన్నీ ఈ విధంగా సాగుతుండడం మంచి పరిణామమే. కానీ ఇంటర్నెట్ వినియోగదారులను ముప్పుతిప్పలు పెట్టే పోకడలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం లేని మెసేజ్‌లు పంపడం, అనుసంధానానికి ప్రయత్నించడం జరుగుతోంది.

ఇలాంటి వాటిని 53 శాతం మంది బ్లాక్ చేయగలుగుతున్నారని అధ్యయనంలో తేలింది. ఇలాంటి వ్యవహారాలను చాలా కష్టంగా 31 శాతం మంది వదిలించుకుంటున్నారు. ఈ పనికి రాని సమాచారం, మెసేజ్‌లను 25 శాతం మంది అసలు పట్టించుకోవడం లేదు. అలాంటి పోస్టులను తమ నెట్ నుంచి 21 శాతం మంది తొలగించేశారు. తమ సోషల్ మీడియా అకౌంట్లను 16 శాతం మంది రద్దు చేసుకున్నారు. లేనిపోని మెసేజ్‌లను ఎవరైతే పంపిస్తున్నారో వారి అభ్యర్థనలను 8 శాతం మంది తోసిపుచ్చుతున్నా ఆ 8 శాతం మంది సీరియస్ రిస్కులో ఉంటున్నారని అధ్యయన నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నెటిజన్లను ప్రలోభపెట్టే వ్యవహారాలు ఆగడం లేదు. చిట్ చాట్‌తో మొదలై చివరకు వీరిని బ్లాక్ మెయిల్ చేసి, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామని రుణయాప్‌లతో ఊరిస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన బాలబాలికలు ఎందరో ఉంటున్నారు.

మార్గాలు ఏవైనా సరే మానవ అక్రమ రవాణా అన్నది గత కొన్నేళ్లుగా సాగుతున్నదే. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులను పరిశీలిద్దాం. హర్యానాలోని కైథాల్ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను గత మే నెలలో అక్రమ రవాణా నుంచి రక్షించగలిగారు. బీహార్ జెహనాబాద్ జిల్లాకు చెందిన మైనర్ బాలికను మద్యం తాగించి పాట్నా రైల్వేస్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి వేరొకరికి 1.7 లక్షలకు అమ్మేశారు. బీహార్, హర్యానాలకు చెందిన బచ్‌పన్ బచావో ఆందోళన్ (బిబిఎ), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (ఎహెచ్‌టియు) యూనిట్లు పోలీస్ బలగాలు, జిల్లా పిల్లల రక్షణ యూనిట్లు (డిసిపియు) జోక్యంతో అంతర్ రాష్ట్ర ఆపరేషన్‌తో ఆ మైనర్ బాలికను చివరకు రక్షించడమైంది.

2017 ఆగస్టులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడిని ఢిల్లీ శివారు ఓ ఫ్యాక్టరీ యజమానికి వెట్టి చాకిరీ కోసం అమ్మేశారు. బిబిఎ వంటి సంస్థలు ఆ బాలుడ్ని రక్షించాయి. బీహార్, జార్ఖండ్, అసోం, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల పేద కుటుంబాల నుంచి వచ్చిన బాలబాలికలను ఉపాధి పేరు చెప్పి మెట్రో నగరాలకు అక్రమంగా రవాణా చేయడం పరిపాటి. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా కౌమార బాలలు ఇదే విధంగా అక్రమంగా రవాణా అవుతున్నారు. వీరిని తీసుకొచ్చే బడా ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనివి. ఆయా ప్రాంతాల్లో బాలలను గుర్తించడానికి క్షేత్ర స్థాయిలో కొన్ని ఏజెన్సీలను నడుపుతున్నాయి. ఈ విధంగా వచ్చిన పిల్లలను మసాజ్ పార్లర్లు, స్పా సెంటర్లకు, వ్యభిచార రాకెట్లకు అమ్ముతున్నారు. ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లే వారి బాధలు మనకు తెలిసినవే.
వెట్టి చాకిరీతో అక్కడ నరకయాతన పడుతుంటారు.

చాలా మంది బాలికలు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తోంది. 2022 ప్రభుత్వ డేటా ప్రకారం కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయం జూన్ వరకు ఇంటి పని చేసే వారి నుంచి 1697 అక్రమ రవాణా ఫిర్యాదులను గ్రహించింది. ఈ నేరాలు తగ్గినట్టు మన దేశం చెప్పుకుంటున్నా ఈ నేరాలను అరికట్ట లేని దేశాల జాబితాలో భారత్ ఉండటం శోచనీయం. ఇలాంటి టైర్ 2 కేటగిరిలో భారత్ ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. వలస కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్, ఉద్యోగం లేదా ఉపాధి వివరాలను నమోదు చేస్తున్నా వలస కార్మికుల అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమ రవాణాదారులను పట్టుకోడానికి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956, క్రిమినల్ లా (అమెండ్‌మెంట్ ) యాక్ట్ 2013 వంటివి ఉన్నాయి. వీటికి తోడు సెక్షన్ 370, 370(ఎ)ల్లో అనేక నిబంధనలను కొత్తగా చేర్చారు. కానీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.

బచ్‌పన్ బచావో ఆందోళన్‌తో సత్ఫలితాలు

నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి 1990 నుంచి పిల్లల అక్రమ రవాణా కు వ్యతిరేకంగా బచ్‌పన్ బచావో ఆందోళన్ (బిబిఎ) ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. బీహార్‌లో ఇదే తరహాలో ముక్తికారవాన్ అభియాన్ ప్రారంభించారు. అదృశ్యమైన పిల్లల ఆచూకీ తెలుసుకోడానికి జనమేళాలు నిర్వహించారు. దక్షిణాసియా మార్చ్ అనే ఉద్యమ యాత్రను కోల్‌కతా నుంచి ఖాట్మండ్ వరకు సాగించారు. పిల్లల అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ప్రయత్నమే ఇదంతా. బచ్‌పన్ బచావో ఆందోళన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష మంది పిల్లలను రక్షించగలగడం గొప్ప విషయం. ఈ సంస్థకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పిఎఫ్) సహకారం అందిస్తోంది.

ఈ సంయుక్త ఆపరేషన్‌లో గత మూడు నెలల్లో 338 మంది పిల్లలను రక్షించడమైంది. దీంతో అక్రమ రవాణాదారులు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. నల్ల అద్దాలు, కిటికీ తెరలు ఉండే ప్రైవేట్ బస్సుల ద్వారా పిల్లలను, యువతులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను కొన్ని లక్షలకు అమ్ముతుండడం బడా వ్యాపారంగా సాగుతోంది. గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో పిల్లల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వ ప్రివెన్షన్, కేర్, అండ్ రీహేబిలిటేషన్ 2021 నమూనా బిల్లును ప్రవేశపెట్టింది. అదింకా అమలు లోకి రావలసి ఉంది. బచ్ పన్ బచావో ఆందోళన్ వంటి సేవా సంస్థలతో పాటు ప్రభుత్వ నిఘా, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ల గలిగితేనే ఇలాంటి అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమవుతుంది.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News