Friday, January 3, 2025

కిరాణా దుకాణాలకు ‘క్విక్’ ముప్పు

- Advertisement -
- Advertisement -

ఆన్ లైన్ షాపింగ్, ఈ – కామర్స్ పోర్టల్స్ రాకతో వస్తువుల కొనుగోలు సులభతరమైంది. నగరాలు, పట్టణాల్లో ఇలా ఆర్డర్ పెడితే, అలా సరుకులు ఇంటి ముందు దర్శనమిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు వేగం పుంజుకోవడంతో ఆన్ లైన్ షాపింగ్ కూడా అదే స్ధాయిలో పెరిగిపోతుంది. వినియోగదారుడు షాపుల చుట్టూ తిరిగే పరిస్దితి లేకుండాపోతుంది. కావల్సిన నిత్యావసరాలు, కోరుకున్న బ్రాండ్ వస్తువులు చౌక ధరల్లో నిమిషాల వ్యవధిలోనే ఇంటికి చేరకుంటున్నాయి. కాలు కదపకుండానే సరుకులు ఇంటికి చేరుకోవడంతో ఆన్ లైన్ షాపింగ్ పట్ల అత్యధికులైన పట్టణవాసుల మొగ్గు చూపుతున్నారు. గడపదాటకుండానే సరుకులు కొనే వ్యవస్దలు అందుబాటులోకి కావడంతో నగరాలు, పట్టణాల్లోని కిరాణా దుకాణాలు వెలవెల పోయే పరిస్ధితి నెలకొంది.
బిజినెస్ టూ బిజినెస్ సంస్ధ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా దుకాణాలు, బడ్డీ కోట్లు సుమారు 6.65 మిలియన్ల వరకు ఉంటాయి. తెలంగాణలో 35 లక్షల వరకు ఉండవచ్చని అంచనావేశారు. మారు మూల గ్రామాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకటి చొప్పున బడ్డీ కొట్టు, చిన్న పాటి కిరాణా దుకాణం ఉందని ఆ సంస్ద ఒక నివేదికలో పేర్కొంది. ఈ దుకాణాలు గ్రామీణుల నిత్యావసరాలు తీర్చడంతో పాటుకు పలువురికి స్ధానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ దుకాణాలు అన్ని గ్రామాల్లో ఉండటం, పట్టణాలకు దూరంగా, రవాణా సౌకర్యం పెద్దగా లేని ప్రాంతాల్లో ఏర్పాటు కావడంతో అన్ని రకాల బ్రాండ్లు ఈ దొరకడం కష్టం. అందుబాటులో ఉన్న సరుకులతోనే గ్రామీణ వినియోగదారులు సర్ధుకుపోవలసి ఉంటుంది.
ఇటీవలి కాలంలో క్విక్ కామర్స్ సేవల నుండి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలు తీవ్రమైన పోటీని ఎదుర్కొనవలసి వస్తుంది. ఇప్పటికే అనేక మంది దుకాణాలను మూసివేయడంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న అత్యధికులు ఉపాధి కోల్పోతున్నారు. మరిన్ని దుకాణాలు మూసివేసేందుకు సిద్దమవుతున్నారు. క్విక్ కామర్స్ సేవల నుండి పోటీని ఎదుర్కొలేక పోతున్నామని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వియోగదారుల అవసరాలు తీర్చలేక, క్విక్ కామర్స్ సంస్ధల స్ధాయిలో రాయితీలు ఇవ్వలేక పోతున్నామంటున్నారు.

దేశ వ్యాప్తంగా 94 శాతం మంది గ్రామీణ ప్రజలు తమ నిత్యావసరాల కోసం కిరాణా దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా క్విక్ కామర్స్ పోర్టల్స్ అందరికీ అందుబాటులోకి రావడం, ఆన్ లైన్ షాపింగ్ వ్యవస్ధలు గ్రామాలకు విస్తరించడం, సూపర్ మార్టులు ఏర్పాటు చేయడం, సరకులన్నింటిపైన ఎక్కువ మొత్తంలో రాయితీలు ఇవ్వడం, అనేక బ్రాండ్లను, కావలసిన వస్తువులన్నింటిని ఒకే చోటు అందుబాటులో ఉంచడం, ఆన్ లైన్ షాపింగ్ సౌకర్యం కల్పించి సరుకులను ఇంటికి ఉచితంగా చేర్చడం లాంటి ఈ కామర్స్ సంస్ధల వ్యాపార వ్యూహాలను కిరాణ దుకాణదారులు తట్టుకోలేక పోతున్నారు.
ఇటీవలి కాలంలో కిరాణా దుకాణాల ట్రెండ్ తగ్గింది. కిరాణా దుకాణాలకు పోటీగా సూపర్ మార్టులు ఏర్పాటవుతున్నాయి. ఈ సూపర్ మార్టుల్లో షాపింగ్ చేయడం చాలా సులభం అని వినియోగదారులు భావిస్తున్నారు. సూపర్ మార్టులు బిజినెస్ టూ కన్స్యుమర్ మోడల్ ను అనుసరించడం లాంటి వ్యూహాలతో ముందుకు రావడంతో గ్రామీణ వినియోగదారులకు కిరాణా దుకాణాలకు దూరమవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కిరాణా దుకాణాల కోసం ప్రత్యేక టెక్నాలజీ వ్యవస్ధలను అందుబాటులోకి తేవలసి ఉందని ఆర్దిక నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ఆర్దిక వ్యవస్దలో కిరాణా దుకాణాల పాత్రను కనుమరుగు చేసే యత్నాలను అడ్డుకొనవలసి ఉందంటున్నారు. క్విక్ కామర్స్ సేవల నుండి కిరాణా దుకాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటున్నారు. గ్రామీణులకు కిరాణా దుకాణాల ద్వారా మెరుగైన సేవలను అందించడంతో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేదిగా ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని కోరుతున్నారు.

భారతదేశం అనేక జీవనమార్గాలకు, అనేక రకలైన వాణిజ్య ప్రక్రియలకు పుట్టినిల్లు. ఈ దేశంలో చిన్న, మధ్యతరగతి రిటైలర్ల మనుగడ గ్రామీణ, నగర వాణిజ్యల మధ్యన అత్యంత కీలకమైనది. స్ధానిక వ్యాపారాలు సాగని పక్షంలో ఉపాధి అవకాశాలు కోల్పోయి గ్రామీణ పేదరికం పెరిగే ప్రమాదం ఉంది. ప్రాంతీయ ఉత్పత్తులపై కార్పొరేట్ రిటైలర్ల ఆధిపత్యం పెరిగి, స్వదేశీ సొగసులను కోల్పోవడానికి దారితీస్తోంది. తక్కువ ధరల వ్యూహంతో వినియోగదారులను ఆకర్షించే కార్పొరేట్ సంస్థలు, కొంత కాలానికే గరిష్ట ధరలను పెంచుతూ మోసానికి పాల్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. అన్ని వ్యవస్ధలను సమతుల్యం చేస్తునే గ్రామీణ కిరాణా దుకాణాలను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణకు పూనుకొనవలసి ఉంటుంది.

కొలను వెంకటేశ్వర రెడ్డి, SP Jails, Retd.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News