న్యూస్ డెస్క్: ఈ ఇంటర్‌నెట్ యుగంలో బట్టల నుంచి ఆహారం దాకా ఏ వస్తువైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే సౌలభ్యం ఏర్పడింది. అవసరమైతే తప్ప నేరుగా దుకాణాలకెళ్లి వస్తువులను కొనాల్సిన వసరం లేదు. కాని..ఆన్‌లైన్ షాపింగ్‌లో కొంత ఆలస్యం జరిగే అవకాశం లేకపోలేదు. ఎంత ఆలస్యమంటే ఎవరూ చెప్పలేరు కూడా..అయితే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆర్డర్ నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిందంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఆ వ్యక్తి ఇటీవలే తనకు ఎదరైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.
ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే టెకీ 2019లో చైనీస్ వెబ్‌సైట్ అలీబాబా ద్వారా ఒక ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఇండియాలో నిషేధానికి గురైన అలీఎక్స్‌ప్రెస్ ద్వారా ఆర్డర్ పెట్టిన నితిన్ తన ఆర్డర్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఈరోజు తనకు ఆర్డర్ డెలిరీ అయిందంటూ అతను పట్టరాని ఆనందంతో ఆ ఆర్డర్ పార్సిల్‌ను ఫోటో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎన్నడూ ఆశను వదులుకోవద్దు అంటూ అతను స్లోగన్ కూడా రాశాడు. ఆ పార్సిల్ మీద 2019 మే అన్న అక్షరాలు కూడా ఉన్నాయి. నితిన్ అగర్వాల్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో మంచి ప్రతిస్పందన లభించింది.
అలీ ఎక్స్‌ప్రెస్ నుంచి తనకు 8 నెలల తర్వాత పార్సిల్ అందిందని అప్పటికే అలీ ఎక్స్‌ప్రెస్ తనకు డబ్బు కూడా రిఫండ్ చేసేసిందంటూ ఒక వ్యక్తి తెలియచేయగా అలాంటి అదృష్టం తనకు దక్కనందుకు మరో నెటిజన్ వగచాడు. మరో వ్యక్తయితే తనకు 6.5 సంవత్సరాల తర్వాత తనకు ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఆర్డర్ పార్సిల్ అందినట్లు వెల్లడించాడు.