Wednesday, January 22, 2025

చెరువులపైన మత్సకారులకే పూర్తి హక్కులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  చెరువులపై పూర్తిహక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోంటూరు వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో కలిసి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా 200 మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వ కార్డులను అందజేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద 6 గురు లబ్దిదారులకు గొర్రెల యూనిట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించాలి…గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మత్స్యకారులు పూర్తిగా నిరాదరణకు గురయ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మత్స్యకారులకు సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు మార్కెట్ లను కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆదాయ మార్గాలను పెంచాలనే ఆలోచనతో మహిళా మత్స్యకారులకు చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

మృగశిర కార్తె సందర్బంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మూడు రోజులపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి ప్రజలకు వివిధ రకాల చేపల వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీ ఎత్తున పెరిగిందని, ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి మత్స్య్కారుడికి అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అందుకోసం నూతనంగా లక్ష మంది మత్స్యకారులకు సోసైటీలలో సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. స్థానిక మత్స్యకారుల సౌకర్యార్ధం కోల్ స్టోరేజీ ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంత్రిని కోరగా, చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మత్స్య శాఖ జిల్లా అధికారి రజినీ, డివిహెచ్‌వో వెంకట్, ఆర్డీవో అంబ దాసు. సర్పంచ్ రాజ్యలక్ష్మి, ఎంపిటిసి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News