ముంబై: ఎన్‌సిపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రబుత్వంలో చేరిన దరిమిలా ఇక ఆర్థిక నేరస్తులైన మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలందని శివసేన(ఉద్ధవ్ థాకరే వర్గం) సొంత పత్రిక సామ్నా బుధవారం వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని ఒన్ ఫుల్(డౌట్) అండ్ టూ హాఫ్ అనే చిత్రంతో సామ్నా పోల్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఒన్ ఫుల్(అనుమానాస్పదం)గా, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ను టూ హాఫ్‌గా పోల్చింది. ఎన్‌సిపిలో ప్రస్తుత పరిణామాలకు ఢిల్లీలోని సూపర్‌పవర్ బాధ్యుడని సామ్నా వ్యాఖ్యానించింది. పార్టీ శాసనసభా పక్షం పార్టీపైన కాని, పార్టీ చిహ్నంపైన కాని అధికారం చేజిక్కించుకోలేదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిందని సామ్నా పేర్కొంది. అవినీతి, నైతికత, దోపిడీ గురించి మాట్లాడే హక్కు బిజెపికి లేదని పత్రిక తెలిపింది.
మహారాష్ట్రలో చేసిన పనికి బిజెపి నవ్వులపాలవుతోందని, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్తులను బిజెపిలో చేర్చుకోవడం ఒక్కటే ఇక మిగిలి ఉందని సామ్నా ఎద్దేవా చేసింది. వీరిలో మొదటి వ్యక్తిని బిజెపి జాతీయ కోశాధికారిగా, రెండవ వ్యక్తిని నీతి ఆయోగ్ చైర్మన్‌గా, మూడవ వ్యక్తిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బిజెపి నియమించవచ్చని సామ్నా వ్యాఖ్యానించింది.
నీటిపారుదల కుంభకోణంలో అజిత్ పవార్ జైలుకు వెళ్లడం ఖాయమని 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు ఫడ్నవీస్ ప్రకటించారని, ఇప్పుడు అదే అజిత్ పవార్ ఫడ్నవీస్ సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని సామ్నా గుర్తు చేసింది.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో జరగాల్సి ఉండగా ఫడ్నవీస్ బంగళా సాగర్‌లో జరగడం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దుస్థితికి తెలియచేస్తోందని సామ్నా వ్యాఖ్యానించింది.