”సహజ మిత్రుడి”తోనే చెలిమి చేద్దామన్నాం..
”మహా” సిఎం ఏక్‌నాథ్ షిండే వెల్లడి
ఫడ్నవీస్‌తో కలసి ఢిల్లీలో బిజెపి పెద్దలతో భేటీ
న్యూఢిల్లీ: తమ సహజ మిత్రపక్షమైన బిజెపితోనే కలసి సాగుదామని శివసేన ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు 3, 4 సార్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన తమ మాట వినలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణం చేసిన ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో కూడిన మహారాష్ట్ర అఘాడి వికాస్(ఎంఎవి) కూటమి పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రేకు ఎన్నోసార్లు నచ్చచెప్పేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాతే చివరకు ఆయనపై తిరుగుబాటు చేయక తప్పలేదని షిండే తెలిపారు. తన కొత్త మంత్రివర్గ కూర్పుపై బిజెపి నాయకత్వంతో చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలసి ఢిల్లీ వచ్చిన షిండే శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం షిండే ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరూ నిజమైన శివసైనికులని అన్నారు.
తమకు సంఖ్యాబలం ఉందని, అసెంబ్లీ స్పీకర్ కూడా దీన్ని గుర్తించారని చెప్పారు. శివసేన ఎన్నికల చిహ్నం ఎవరికి దక్కాలన్న ఏర్పడిన వివాదం గురించి ప్రశ్నించగా తమకు న్యాయస్థానంపై విశ్వాసం ఉందని, అసలైన శివసైనికులమైన తాము ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని షిండే స్పష్టం చేశారు. అధికారం కోసం తన మిత్రపక్షమైన బిజెపి ఎంతకైనా తెగిస్తుందన్న ఆరోపణలను ప్రస్తావించగా ఆయన వాటిని ఖండించారు. తనకు అండగా 50 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని, బిజెపికి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రిగా బిజెపి నుంచి ఉంటారని అందరూ ఊహించారని కాని..ముఖ్యమంత్రిగా తనలాంటి సామాన్య కార్యకర్త బాధ్యతలు చేపడతారని ఎవరైనా ఊహించారా అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
బాల్ థాకరే నమ్మిన హిందూత్వ సిద్ధాంతాన్ని ఉద్ధవ్ థాక్రే నిర్లక్షం చేశారని, కాని బిజెపి దాన్ని బలపరుస్తోందని షిండే అన్నారు. కాగా..షిండేతోపాటు ఢిల్లీ వచ్చిన బిజెపి నాయకుడు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాము ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో తన పార్టీ తనను ముఖ్యమంత్రిని చేసిందని, ఇప్పుడు పార్టీ అవసరాలను బట్టి తాను ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఆయన వివరించారు. ఏక్‌నాథ్ షిండే తమ నాయకుడు, ముఖ్యమంత్రని, ఆయన కింద తామంతా పనిచేస్తామని ఫడ్నవీస్ చెప్పారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది సహజ కూటమిని పునరుద్ధరించామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా..షిండే, ఆయన వర్గానికి చెందిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జులై 11న విచారణ జరగనున్న నేపథ్యంలో షిండే, ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చి బిజెపి అగ్రనాయకులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరు నాయకులు తమ ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలను కూడా కలుసుకోనున్నారు.