Monday, December 23, 2024

స్ట్రాంగ్ రూమ్‌లో ఓటింగ్ ఇవిఎంలే భద్రపర్చాలి !

- Advertisement -
- Advertisement -

20లోగా ఓటరు కార్డులను ముద్రించాలి
కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్
ప్రలోభాల కట్టడికి ఇసి ప్రత్యేక ఏర్పాట్లు
వ్యయ పరిశీలకుడి ఫోన్ నంబరు 76708 39762

మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల వివరాలున్న ఇవిఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూములలో మరే ఇతర ఇవిఎంలను భద్రపరచడానికి వినియోగించకూడదని కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్ రాష్ట్ర పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి పలు విలువైన సూచనలిచ్చారు. ఓటరు కార్డుల ముద్రణ నవంబరు 20వ తేదీకల్లా పూర్తయిపోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నియమ,నిబంధనలు అమలయ్యేది అట్టడుగుస్థాయిలోనే అయినందు వల్ల పోలింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలోక్షేత్రస్థాయి సిబ్బందికి చివరి నిమిషం వరకు శిక్షణ ఇస్తూనే ఉండాలని మరో కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు(పోలీస్) దీపక్ మిశ్రా సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల విధులతో సంబంధంలేని వ్యక్తులు వృథా కాలక్షేపం చేస్తూ తచ్చాడడాన్ని అనుమమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. నోటిఫై చేసిన పోస్టల్ ఓటర్ల తుదిజాబితా ముద్రణ ప్రతిని తప్పనిసరిగా అభ్యర్థులకు, రాజకీయపార్టీలకు ఇచ్చి, వారి నుండి పొందిన రశీదును భద్రపరచుకోవాలనీ, దీనివల్ల కొన్ని వివాదాలను, దురభిప్రాయాలను సులభంగా తప్పించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తేలికగా స్పందించడం సరికాదని, అతిగా స్పందించే విషయంలో అది శిక్షార్హమే అయినా కొన్ని మినహాయింపులతో క్షమించవచ్చంటూ చమత్కారంగానే చెప్పినా, గట్టి హెచ్చరిక ధోరణిలో ఆయన స్పషం చేశారు. ఎ

న్నికల వ్యయాల నిర్వహణను నిర్దిష్టంగా ఎలా నిర్వహించాల్సిందీ గుర్తు చేసిన కేంద్ర (వ్యయ)ప్రత్యేక పరిశీలకుడు ఆర్. బాలకృష్ణన్, షాడో రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. పోటీ చేసే అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కేవలం సాంకేతిక కారణాలతో అనుమతులను తిరస్కరించవద్దని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల నిబంధనలు, నియమాలను గౌరవిస్తూనే, సౌకర్యవంతమైన ప్రచారం కోసం అభ్యర్థులకు వెసులుబాటు ఉండేట్లు కూడా చూడాల్సి ఉంటుందనీ, దానికి కారణం ప్రజాభిప్రాయం పొందడానికి నేరుగా ప్రచారం చేసుకోవడమే వారికున్న ఉత్తమమైన, సులభమైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

అఫిడవిట్‌లు దాఖలయిన వాటిని పరిశీలించి వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆయన రిటర్నింగ్ అధికారులకు గుర్తు చేశారు. అసంపూర్తిగా ఉన్న అఫిడవిట్లను గుర్తించిన వెంటనే అభ్యర్థులను అప్రమత్తం చేయాలని ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు సిఈఓ లోకేష్ కుమార్, జాయింట్ సిఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సిఇఓ సత్యవాణి, డిజిపి అంజనీకుమార్, రాష్ట్ర నోడల్ అధికారి(వ్యయం) మహేష్ భగవత్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, డిఈఓలు, ఎస్పీలు, కమిషనర్, జిహెచ్‌ఎంసి తదితరులు పాల్గొని తమ అనుభవాలను ప్రత్యేక పరిశీలకులతో పంచుకున్నారు.

ప్రలోభాల కట్టడికి ఇసి ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వ్యయాలను నియోజకవర్గాల వారీగా లెక్కించేందుకు ఇసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ర వ్యయ పరిశీలకుడిగా బిఆర్ బాలకృష్ణన్‌ను నియమించింది. రాష్ట్రంలో ఎక్కడైన అభ్యర్థులు నిర్దేశించిన కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు గుర్తించిన, ప్రలోభాలకు గురిచేస్తున్నా.. వ్యయ పరిశీలకుడి ఫోన్ నంబరు 76708 39762కి ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News