31మందిలో ఒక్కరికే చోటు కల్పించడం పట్ల ప్రతిపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే చట్ట సవరణబిల్లు పరిశీలన కోసం ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘంలోని 31 మందిలో ఒక్క మహిళా ఎంపీకే స్థానం కల్పించడం పట్ల ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారుల వివాహనిషేధ(చట్టసవరణ) బిల్లు పేరుతో దీనిని శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది చట్టరూపం దాల్చితే వివిధ మతాలకు చెందిన మహిళలపై ప్రభావం చూపుతుందన్న ప్రతిపక్షాల అభ్యంతరాలతో స్థాయీ సంఘం పరిశీలనకు పంపారు. ఈ బిల్లును మహిళా, శిశు అభివృద్ధిశాఖ రూపొందించింది. ప్రస్తుతం మహిళల కనీస వయసు 18 ఏళ్లుగా చట్టం ఉంది. సవరణబిల్లు చట్టంగా మారితే కనీస వయసు 21 ఏళ్లు అవుతుంది. ఇప్పటికే ఇది పురుషుల విషయంలో అమలులో ఉంది. సమానత్వం ప్రాతిపదికన మహిళల కనీస వయసునూ పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
స్థాయీ సంఘంలోని 31మంది ఎంపీల్లో టిఎంసి ఎంపి సుస్మితాదేవ్ ఒక్కరే మహిళ. స్థాయీ సంఘానికి బిజెపి ఎంపి వినయ్ సహస్రబుద్ధే నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో ఎక్కువమంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుండేది. అయినప్పటికీ ఈ అంశంపై ఆసక్తిచూపే బృందాలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని సుస్మిత హామీ ఇచ్చారు. మహిళల అంశంపై తమ వాదన వినిపించేందుకు ఎక్కువమంది మహిళా ఎంపీలకు చోటు కల్పించాల్సి ఉన్నదని ఎన్‌సిపి ఎంపి సుప్రియాసూలే అన్నారు. ఈ బిల్లును చట్టంగా తేవాలంటే పలు మతాల పర్సనల్ లాస్‌ను (చట్టాలను) కూడా మార్చాల్సి ఉంటుంది.