యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవా మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు.
మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. ప్రాకార మండపంలో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను భక్తులకు అర్చకులు వివరించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకొని తరించారు.
శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రూ.7,15,834 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.46,800, బ్రేక్ దర్శనం ద్వారా రూ.65,100, వ్రత పూజల ద్వారా రూ.31,200, వీఐపీ దర్శనాల ద్వారా రూ.22,500, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.1,50,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.2,96,160తో పాటు తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ నెల 25న ఆలయ హుండీ లెక్కింపు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండకింద గల వ్రతమండపంలో ఉదయం 7 గంటల నుంచి హుండీ లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, ఆలయ ఈవో, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ఉద్యోగుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు.