Saturday, December 21, 2024

స్పర్శ్‌లో పిల్లల వార్డు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Opening of Children's Ward at Sparsh

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్పర్ష్ ధర్మశాల రోగికి, కుటుంబ సభ్యులకు మానసికంగా గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాణి కుముదిని అన్నారు. స్పర్ష్ హాస్పైస్ వరల్డ్ హాస్పైస్, పాలియేటివ్ కేర్ డేని పురస్కరించుకొని శనివారం ఖాజాగూడలో పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ వార్డును నటుడు దగ్గుబాటి రానా ప్రారంభించారు. 12 పడకలతో ప్రారంభమైన స్పర్శ్ ఇప్పుడు 82 పడకలకు విస్తరించింది. ఇందులోనే 10 పడకలను ప్రత్యేకంగా చిన్నారుల కోసం తీర్చిదిద్దారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాణికుముదిని మాట్లాడుతూ రోగులకు సాంత్వన చేకూర్చే ధర్మశాలకు ’స్పర్ష్’ (తల్లి స్పర్శ) అని చాలా సముచితంగా పేరు పెట్టారని అభినందించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సింది పిల్లలే కాదు. ఇలాంటి సంస్థ ఒక కుటుంబం చేసే పాత్రను పోషిస్తుందన్నారు. స్పర్ష్ హాస్పైస్ వంటి మానవీయ స్పర్శతో సేవా దృక్పథం కలిగిన సంస్థ విస్తారిత కుటుంబమని ఆమె అన్నారు.

నటుడు దగ్గుబాటి రానా మాట్లాడుతూ.. చాలా మంది దేవాలయంగా భావించే స్పర్శ్ ధర్మశాలను సందర్శించడం తన అదృష్టమని అన్నారు. రెండ్రోజుల క్రితమే మా అమ్మ గుడికి వెళ్లాలని చెప్పింది. ఆ దేవాలయం ఇదేనని అన్నారు. స్పర్ష్ ధర్మశాలలో గొప్ప మానవ సేవ చేస్తున్న వారందరికి ధన్యవాదాలు.. స్పర్శ్‌కు తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. స్పర్శ్ హాస్పైస్ వంటి ఉచిత సౌకర్యం క్యాన్సర్ బాధితుల్లో మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయన్నారు. 11 ఏళ్లలో 5500 మంది రోగులకు ఉచితంగా సేవలందించడం అభినందనీయన్నారు.

రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ధూళిపూడి, ట్రస్టీ జగదీశ్ మాట్లాడుతూ పూర్తి స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 ఎకరాల భూమిని కోరినట్లు తెలిపారు. మహిళల గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ దృష్టిలో ఉంచుకుని మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. రోగి శారద భర్త రామకృష్ణ, క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి యువరాజ్ తల్లి లక్ష్మి మాట్లాడి స్పర్ష్ హాస్పిస్‌లోని సిబ్బంది అందిస్తున్న సేవకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కంచర్ల, రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ సభ్యురాలు తన్వి, ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News