చత్తీస్‌గఢ్=తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా కేంద్ర బలగాలు కర్రెగుట్ట అడవులను తమ ఆధీనంలోకి తీసుకొని మావోయిస్టుల కోసం అన్వేషిస్తున్నాయి. వేలాది కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను నిరంతరంగా చేపడుతున్నాయి. సుమారు వెయ్యి మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లోని సొరంగాలలో ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్ బలగాలు ఆ దిశగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని చత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, కర్రెగుట్టల చుట్టూ మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చడంతో కూంబింగ్ ఆపరేషన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
మావోయిస్టులు అమర్చిన సుమారు 100కు పైగా బాంబులను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేసినట్లు సమాచారం. మావో యిస్టులు బీరు బాంబులను సైతం అమర్చగా వాటిని చూసిన కేంద్ర బలగాలు ఆశ్చర్చం వ్యక్తం పరుస్తున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటంతో కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశాయి. ఇదిలా ఉండగా కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.