బోస్టన్ : ప్రపంచ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఆపరేషన్ ఘట్టం ఆవిష్కృతం అయింది, నెలల నిండని దశలోనే ఉన్న గర్భస్థ శిశువుకు తల్లి గర్భంలోనే ఉండగానే బోస్టన్‌లోని అమెరికా వైద్యుల బృందం ఆపరేషన్ జరిపింది. పైగా ఇది అత్యంత అరుదైన బ్రెయిన్ సర్జరీ. బిడ్డ గర్భంలోనే ఉన్నప్పుడు రూపుదిద్దుకుంటున్న జీవి రక్త నాళాల్లో తలెత్తిన అసాధారణ స్థితిని సరిదిద్దేందుకు ఈ డాక్టర్లు అపూర్వ రీతిలో ఆపరేషన్ నిర్వహించారు. నిండు గర్భిణి ప్రాణాలు, లోపల ఉన్న పసికందు చెదరకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెదడు రక్తనాళాల దిద్దుబాటుకు జరిపిన శస్త్రచికిత్సను బోస్టన్ పిల్లల ఆసుపత్రిలో నిర్వహించారు. రక్తనాళాల అసాధారణ స్థితి శిశువుకు ఆ తరువాత తీవ్ర స్థాయిలో ప్రాణాంతకం అవుతుందని గుర్తించి ముందుగానే ఆపరేషన్ జరిపారు. బ్రెయిన్ నుంచి గుండెకు రక్త ప్రసరణ చేసే రక్తనాళాలు సరిగ్గా వృద్ధి చెందని స్థితి అసాధారణ జబ్బు అవుతుంది. దీనిని సరిదిద్దకపోతే రక్తనాళాలు ఉబ్బి గుండె పనిచేయడం ఆగిపోతుంది.
ఇటువంటి ఘటనల్లో ప్రసవం తరువాత పుట్టిన బిడ్డ గుండె పనిచేయకపోవడం లేదా బ్రెయిన్ స్తంభించిపోవడం జరుగుతుందని బోస్టన్ ఆసుపత్రిలో రేడియాలిజిస్టు అయిన డాక్టర్ డారెన్ ఒర్బాచ్ తెలిపారు. తమ ముందుకు వచ్చిన ఈ వైద్యశాస్త్ర సవాలుకు క్లిష్టమైన ఆపరేషన్ ఒక్కటే మార్గం అని నిర్ణయించి శస్త్రచికిత్సకు దిగినట్లు వెల్లడించారు. ఈ అరుదైన సంక్లిష్టతతో పుట్టే వారికి తరువాతి క్రమంలో కూడా ఆపరేషన్ నిర్వహించవచ్చు. అయితే ఇది విజయవంతం అవుతుందనే నమ్మకాలు ఎక్కువగా ఉండవని డాక్టర్లు తెలిపారు.
ఆపరేషన్ విజయవంతం అయినా తరువాత ఇటువంటి పిల్లలు తీవ్రస్థాయి వ్యాధులకు తేలిగ్గా గురవుతారు. ఇప్పుడు తల్లి గర్భంలోనే ఆపరేషన్ నిర్వహించిన తరువాత లోపలి శిశువు క్రమేపీ కుదుటపడుతున్నట్లు ప్రసవం నాటికి అంతా సర్దుకుంటుందని వైద్యులు తెలిపారు. గర్భవతికి సాధారణ పరీక్షల దశలో ఆల్ట్రాసౌండ్ నేపథ్యంలో పుట్టే బిడ్డకు అరుదైన రక్త నాళాల సమస్య ఉందని వెల్లడైంది. దీనితో 34 వారాల గర్భవతికి ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇది తల్లికి జరిపిన ఆపరేషన్ ద్వారా లోపలి బిడ్డకు జరిగిన ఆపరేషన్ అయింది. ఇప్పుడు జరిగిన శస్త్రచికిత్స వివరాలను స్ట్రోక్ జర్నల్‌లో ప్రచురించారు. ఆపరేషన్ తరువాత జన్మనిచ్చిన ఈ బిడ్డ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని నిర్థారించారు.