Thursday, January 23, 2025

‘ఆపరేషన్ వాలెంటైన్’ చూస్తే మన జవాన్లకు సెల్యూట్ కొడతారు

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ’ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ “పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు.

అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుంది. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది కాబట్టి సినిమా పరంగా పెట్టిన పేరు ’ఆపరేషన్ వాలెంటైన్’అని వరుణ్ చెప్పినప్పుడు చాలా సెన్సిబుల్‌గా ఉందనిపించింది. దర్శకుడు శక్తి ప్రతాప్ సొంత ఖర్చుతో దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి సర్జికల్ స్ట్రైక్‌పై షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని అధికారులు ఆయనను ప్రోత్సహించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కంటెంట్‌ని అద్భుతంగా తీశాడు. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి.

ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది”అని అన్నారు. ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని శక్తిప్రతాప్ ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో మన దేశ వైమానిక దళ వీరుల త్యాగాల్ని, గొప్పతనాన్ని చాటేలా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. మిక్కీ జే మేయర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వాడు గుండెలపై చేయి వేసుకొని మన జవాన్లకు సెల్యూట్ కొడతారు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “ఈ సినిమాకి వరుణ్ తేజ్ మెయిన్ పిల్లర్. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, డ్రామా, అడ్వెంచర్, దేశభక్తి… ఇలా చాలా అంశాలున్నాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సందీప్ ముద్దా, నాగేంద్రబాబు, సాగర్ కే చంద్ర, కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News