Sunday, January 19, 2025

ఇంత దారుణమైన మాటలా!

- Advertisement -
- Advertisement -

ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని పదే పదే సగర్వంగా ప్రకటిస్తుంటారు. ఈ మాటలు విని భారతీయులు ఎంతో ఆనందించి ఉంటారు కూడా. అటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ఒక ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను విని భారత దేశమే కాదు, ప్రపంచమే దిగ్భ్రాంతికి గురైంది. తన ప్రసంగం తర్వాత నలుమూలల నుంచి వస్తున్న స్పందనలను గమనించినపుడు, మోడీ మరీ ఇంతగా పతనం కావడం నాగరికులను తలదించుకునేట్లు చేస్తున్నది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై వార్తలు, వ్యాఖ్యానాలు, ఫోటోలు భారతీయ పత్రికలు, ఛానళ్ళలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విరివిగా వెలువడుతున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంలోని కోట్లాది ఓటర్ల సంఖ్య, మూలమూలకూ పాకిన విస్తృతమైన పోలింగ్ ఏర్పాట్లు, రోజంతా సాగే ప్రచారాల హోరు యావత్ ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తున్నది. అది ఏ స్థాయిలో ఉన్నదో, ప్రపంచాన్ని ఎంత అబ్బురపరుస్తున్నదో, భారత ప్రజాస్వామ్యం ఎన్ని ప్రశంసలను పొందుతున్నదో అంతర్జాతీయ మీడియాను గమనిస్తున్న వారికి గాని తెలియని విషయం. ఇది దేశ ప్రజాస్వామ్య పరిస్థితి కాగా, మరొక వైపున నరేంద్ర మోడీకి గాని, ఆయన పార్టీ బిజెపికి గాని, వారి మాతృ సంస్థ అయిన సంఘ్ పరివార్‌కు గాని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారిగా అంత మంచి పేరేమీ లేకపోవడం గమనార్హమైన విచిత్ర స్థితి.

ఈ స్థితి కేవలం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినది కాదు. నాయకులకు, సంస్థలకు వాజ్‌పేయ్, అద్వానీల కాలంలో అంతటా ఎంతటి ప్రతిష్ఠ ఉండేదో, మోడీ కాలం నుంచి అంతగా పతనమవుతూ వస్తున్నది. అందుకు ఆరంభం ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అందుకే తనపై అమెరికా అసాధారణమైన రీతిలో ప్రవేశ నిషేధాన్ని విధించింది. ఇదే పరిస్థితులు ఆయన ప్రధాని అయిన తర్వాత సైతం కొనసాగటం వల్లనే, ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచీలో ఇండియా స్థానం 105కు పతనమైంది. మన ఆర్థిక వ్యవస్థ అయిదవ అతి పెద్దదని, త్వరలో మూడవ స్థానానికి చేరుతుందని (అదెంత నిజమో గాని)ప్రకటించే మోడీ ప్రభుత్వం, మానవాభివృద్ధి సూచీలో, ఆకలి సూచీలో, పత్రికా స్వేచ్ఛ సూచీలో, ప్రజాస్వామ్య సూచీలో ఎక్కడున్నామో మాత్రం ఒక్కటంటే ఒక్క సారైనా పొరపాటుగానైనా మాట్లాడదు. మీడియాలో గాని, మేధావుల నుంచి గాని ఎన్ని విమర్శలు వెలువడినా స్పందించదు.

ఇటువంటి నేపథ్యాలలో, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ఇంత సంరంభంగా సాగుతున్నపుడు, మోడీకి గల ప్రజాస్వామిక ప్రతిష్ఠ గొప్పగా ఏమీ లేని స్థితిలో, ఆయన 21వ తేదీన రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఉలికిపడేట్లు చేశాయి. పైన అనుకున్నట్లు ఆయనకు ఈ విషయాలలో మంచి పేరు ఎప్పుడూ లేదు. అయినప్పటికీ కొన్ని పతనాలు మరింత ఉలికిపడేట్లు చేస్తాయి. నిజానికి గతంలోనూ ఆయన ఒక సభలో “వారిని (ముస్లింలను), వారు ధరించే దుస్తులతో కూడా గుర్తించగలరు మీరు” అని, అందరినీ ఆశ్చర్యపరిచారు. విమర్శలకు గురయ్యారు. కాని ఆయన అందుకు జంకే నాయకుడు గాని, ఆత్మవిమర్శతో సవరించుకునే మనిషి గాని ఎంత మాత్రం కాదు. పైగా, ఎత్తి చూపిన వారిపైనే తను, తన వారు ఎదురు దాడులు సాగిస్తారు.

ఇంతకూ ప్రధాని మోడీ రాజస్థాన్ ప్రచార సభలో అన్నదేమిటి? “వారు (అనగా కాంగ్రెస్) లోగడ అధికారంలో ఉన్నప్పుడు, దేశ సంపదలపై మొదటి హక్కు ముస్లింలదని అన్నారు. దాని అర్థం ఈ సంపదలన్నీ పోగు చేసి ఎవరికి పంచుతారు? ఎవరికి చాలా మంది పిల్లలున్నారో వారికి పంచుతారు. దేశంలోకి చొరబడి వచ్చిన వారికి పంచుతారు. అంటే, మీరు కష్టపడి సంపాదించింది అట్లా చొరబాటుదారులకు పంచుతారా? ఇది మీరు ఒప్పుకుంటారా? వారు లోగడ అధికారంలో ఉన్నప్పుడు, దేశ సంపదలపై మొదటి హక్కు ముస్లింలదన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో, మీ తల్లులు, అక్కా చెల్లెళ్ల బంగారం లెక్కలు తీసి, అది జప్తు చేసి, అదంతా పంచుతామని చెప్పింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సంపదలపై మొదటి హక్కు ముస్లింలదని ప్రకటించింది. అనగా ఈ బంగారమంతా వారికి పంచుతారు. ఈ అర్బన్ నక్సలైట్ల ఆలోచనలు నా తల్లులు, అక్కా చెల్లెళ్ల మంగళ సూత్రాలను కూడా వదలిపెట్టవన్న మాట’.

మనం కాంగ్రెస్ అభిమానులమా కాదా అన్నది కాదు ప్రశ్న. మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో గాని ఇటువంటి మాటలు ఉన్నాయా అనేది ప్రశ్న. లేవని స్వయంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయటమే కాదు, ఆ పార్టీని వ్యతిరేకించే స్వతంత్ర పరిశోధకులు కూడా ఆ మాటే అన్నారు. అట్లా కాదంటే ప్రధాన మంత్రి కార్యాలయం గాని, బిజెపి గాని మోడీ ఆరోపణలకు ఆధారాలను చూపాలి. ఆయన చేసినవి సాధారణ విమర్శలు కావు. ప్రజాస్వామ్యంపై, సమాజంపై, సామాజిక వర్గాలపై, శాంతి భద్రతలపై ప్రభావం చూపగల తీవ్రమైన ఆరోపణలు. ఎన్నికలలో ఓటింగ్‌ను కూడా ప్రభావితం చేయగలవని వేరే చెప్పనక్కర లేదు. మోడీ ఉద్దేశమే అదని కూడా కనిపిస్తున్నదే. కాని, దీనంతటి మధ్య ప్రజాస్వామ్యం, ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక పరిస్థితి ఏమవుతున్నట్లు?
మోడీ తన వ్యాఖ్యలు చేసి రోజులు గడిచిపోతున్నాయి.

అందుకు ఆధారాలేమిటనే ప్రశ్నలు దేశ విదేశాల నుంచి వినిపిస్తున్నాయి. కాని అటు నుంచి ఎటువంటి స్పందనలు లేవు. అంతేకాదు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, కనుక చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. కాంగ్రెస్ నుంచి మాత్రమే కాదు, ఆ పార్టీతో సంబంధం లేని ఇతరుల నుంచి కూడా. కాని 23 వ తేదీన ఈ వ్యాసం రాసే సమయానికి కూడా ఎన్నికల సంఘం నుంచి ఉలుకు పలుకు లేదు. ఇతర పార్టీల నుంచి, వ్యక్తుల నుంచి చీమ చిటుక్కుమన్నా ఎంతో ఉత్సాహంగా నోటీసులిచ్చి ఎన్నికల నియమావళిని పరిరక్షించజూసే ఆ సంఘం ఎందువల్ల మౌనం వహిస్తుండవచ్చునో ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. పైగా ఈ విషయమై ఎన్నికల సంఘం అధికారులను మీడియా ప్రతినిధులు మరునాడు సోమవారం ప్రశ్నించగా, ‘నో కమెంట్‌” అంటూ దాట వేయడం గమనార్హం. ఇవన్నీ తన కనుసన్నలలో జరిగేవి కనుకనే కావచ్చు మోడీ అదే సోమవారం రోజున ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో మాట్లాడుతూ, ముస్లింలు అనే మాట ఒక్కటి అనకపోవడం మినహా, రాజస్థాన్ ప్రసంగంలోని వ్యాఖ్యలన్నింటినీ పునశ్చరించారు.

మన్మోహన్ సింగ్ గాని, కాంగ్రెస్ గాని అన్నదేమిటి? ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ బడుగు బలహీన వర్గాలన్నింటినీ కలిసి, వారితోపాటు మహిళలను కూడా కలిసి, వీరందరి అభివృద్ధి సంక్షేమాల పట్ల ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఆ మాట కాంగ్రెసే కాదు అన్ని పార్టీలూ ఎల్లప్పుడూ అంటున్నదే. ఈ వర్గాల బాగు కోసం ఈ మాటలు రాజ్యాంగంలో, చట్టాలలో, ప్రణాళికలలో ఉన్నవే. స్వయంగా బిజెపి కూడా గాంధీయన్, సోషలిజం అంటూ మాట్లాడింది. ప్రధాని మోడీ సైతం సబ్‌సా కాథ్, సబ్‌కా వికాస్ అనే నినాదంతో ప్రచారాలు చేశారు. అటువంటపుడు, ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో, కేవలం ముస్లింల గురించే కాంగ్రెస్ మాట్లాడిందన్నట్లు విడదీసి చూపడం, మహిళల మంగళ సూత్రాలను లాక్కోవటంతో సహా ఈ దేశ ఆస్తులన్నీ ముస్లింలకు, వారు పెద్ద సంఖ్యలో కనే పిల్లలకు, ఇతర దేశాల నుంచి చొరబడి వచ్చే వారికి పంచివేస్తారటం ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తికి ఎంత దారుణమైన పతనమవుతుంది? అధికారం కోసం స్పర్ధలతో సాగే ఎన్నికల ప్రచారంలో పలువురు ఎంతో కొంత మాట తూలుతుంటారు. కాని ఈ స్థాయిలో జరగడం మనం ఎన్నడూ చూడలేదు.

దేశానికి ఇంత వరకు ప్రధాన మంత్రులైన వారిలో ఎవ్వరు కూడా ఇటువంటి సంస్కృతిని ప్రదర్శించలేదు. మోడీ ఈసారి కూడా గెలిచి మూడవ సారి ప్రధాని కాగలరన్న భావనే చాలా మందిలో ఉంది. కనీసం దానిని పరిగణనలోకి తీసుకుని అయినా ఆయన తగిన సంస్కారాన్ని చూపకపోయినట్లయితే, తనకు ఇప్పటికే వచ్చిన నియంత అనే అప్రతిష్ఠ, మనది “ఎన్నికైన నియంతృత్వ” మనే అపకీర్తి, ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో ఈసరికే 105 కు చేరిన మన ర్యాంకు మరింత దిగజారగలవనటంలో సందేహం ఉండదు. అంతకన్నా ముఖ్యంగా, ఈ వైవిధ్యభరిత సువిశాల దేశాన్ని సంయమనంతో, సమతులనంగా పరిపాలించడం మరింత కష్టతరమవుతుందనే భయం కలుగుతున్నది.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News