Friday, December 20, 2024

ఆర్‌విఎంలు అత్యవసరం కాదు

- Advertisement -
- Advertisement -

పట్టణ, నగర ఓటర్లు ఓటింగ్ పట్ల ప్రదర్శిస్తున్న అయిష్టానికి, నిర్లక్షానికి తెర దించకుండా వలస కార్మికుల ఓట్లపై దృష్టి పెట్టడం అర్థం లేని పని అని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క కంఠంతో తెలియజేయడం అర్థవంతంగా వున్నది. కొత్తగా సిద్ధం చేసిన రిమోట్ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఆర్‌ఇవిఎంలు) పని తీరును ప్రదర్శించడానికి ఎన్నికల సంఘం సోమవారం నాడు న్యూఢిల్లీ రాజ్యాంగ క్లబ్ భవనంలో నిర్వహించిన సమావేశం ఆ ప్రదర్శన జరగకుండానే ముగిసిపోయింది. ఆర్‌ఇవిఎంలపై రాజకీయ పక్షాలు అభిప్రాయాలు తెలియజేయవలసిన గడువు తేదీ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. స్వస్థలాలు విడిచి దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేస్తున్న వలస కార్మికులు తామున్న చోటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోడానికి ఉపయోగపడే ఆర్‌ఇవిఎంను కనుగొన్నట్టు ఎన్నికల సంఘం గత డిసెంబర్ 29న ప్రకటించింది.

ఒక్కొక్క యంత్రం ద్వారా ఒకేసారి 72 నియోజక వర్గాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలియజేసింది. ఎన్నికలలో ఓటు వేయడానికి పని స్థలాలను విడిచిపెట్టి సుదూరంలోని స్వస్థలాలకు వెళ్ళడం వల్ల కలిగే ఇబ్బందులను ఇటువంటి యంత్రాలు తొలగిస్తాయి. అందుచేత ఇవి వుండవలసినవే. అందుకే ఎన్నికల సంఘం వీటి గురించి ప్రకటించినప్పుడు రాజకీయేతర వర్గాల నుంచి హర్షం వ్యక్తమైంది. సోమవారం నాడు ప్రతిపక్ష పార్టీలు ప్రసరించిన విశాలమైన వెలుగులో వీటిని గురించి యోచించినప్పుడు ఈ యంత్రాలను ప్రవేశపెట్టడానికి ముందు జరగాల్సినవి చాలా వున్నాయనే వాదనతో ఏకీభవించకుండా వుండలేము. 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 29 నుంచి 30 కోట్ల ఓట్లు పడలేదు, కేవలం 60 పైచిలుకు శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది.

అందుచేత దాదాపు అందరు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా చేయవలసిన అవసరం వుంది. అయితే పడకుండాపోతున్న ఓట్లలో వలస కార్మికుల ఓట్లు ఎన్ని అనేది ఇదమిత్థంగా తేలలేదు. కాగా, పట్టణాలు, నగరాల్లో ఓటర్లు మాత్రం పోలింగ్ రోజున క్రికెట్ వీక్షణాన్ని చిత్తగించడం, విహార యాత్రలు సాగించడం వంటి పనులలో తలమునకలైపోయి ఓటింగ్ అనేది పచ్చి పనికిరాని పని అని చిరకాలంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కూడా సిమ్లా వంటి నగరాల్లో ఇది రుజువైంది. అందుచేత ప్రతిపక్షాలు సూచించినట్టు ఆర్‌ఇవిఎంల వైపు దృష్టి పెట్టే ముందు పట్టణ, నగర ఓటర్ల దృష్టిని మార్చవలసిన అవసరం ఎంతో వుంది. గ్రామీణ బలహీన వర్గాల ఓటర్లలో అధికులైతే పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే మద్యానికి, బిర్యానీకి, ఇతర ప్రలోభాలకు ఓటును అమ్ముకోడం మామూలైపోయింది. దీనిని నిర్మూలించడానికి మన ప్రజలకు ప్రజాస్వామ్య బాధ్యతను గురించి పెద్ద ఎత్తున చెప్పాలి.

రాజ్యాంగ ఆశయాలను వివరించాలి. భిన్నత్వంలో ఏకత్వం గురించి, బహుళ సంస్కృతుల సమ్మేళనా న్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి సాకల్యంగా రాజ్యాంగ అధికరణల వెలుగులో చెప్పాలి. ఎన్నికలలో పాల్గొనే పార్టీలన్నింటికీ సమానమైన వనరులు లేకపోడం, కేవలం పాలక పక్షానికి మాత్రమే అనుకూలంగా గల ఎలెక్టోరల్ బాండ్ల విధానాన్ని సరిచేయకపోడం, ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం వరిస్తున్న ప్రస్తుత ఫస్ట్ పాస్ట్ పోస్ట్ విధానానికి బదులు దామాషా ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టవలసిన అవసరాన్ని గుర్తించకపోడం వంటి సమస్యలు అలాగే వుండగా, ఆర్‌ఇవిఎంల కోసం తొందరపడవలసిన అవసరం లేదని ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయం ఎంతో విలువైనది. ఈ సమావేశంలో 8 జాతీయ పార్టీలు, 7 గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు పాల్గొన్నాయి. ఇవిఎంలపైనే మన రాజకీయ పార్టీల మధ్య ఏకీభావం లేదు. దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఇవిఎంల శీలాన్ని శంకించినవే.

చాలా దేశాలు ఇవిఎంలను ఇంకా ప్రవేశపెట్టనే లేదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికాలు ఇందులో వున్నాయి. అందుచేత ఆర్‌ఇవిఎంలు ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణం ప్రవేశపెట్టదగినవి ఎంత మాత్రం కావు. ప్రజల తీర్పు ఖచ్చితంగా వెల్లడవ్వాలంటే దామాషా ఓటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చుకోవాలి. మన పొరుగునున్న నేపాల్‌లో కొన్ని సీట్లకు దామాషా పద్ధతి ఎన్నిక జరుగుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన ఇండియాలో అదెందుకు జరగకూడదు? దామాషా ఓటింగ్ వల్ల ఆయా పార్టీలకు లభించే ఓట్ల సంఖ్యను బట్టి సీట్ల కేటాయింపు జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల బెడదను కూడా అది తొలగించగలుగుతుంది. ముందుగా ఇటువంటి వివేకవంతమైన, ప్రజాస్వామ్య హితవైన ఆలోచనలు చేయడం కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News