Monday, December 23, 2024

ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం జూన్ 23కి వాయిదా?

- Advertisement -
- Advertisement -

పాట్నా: కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందుబాటులో లేని కారణంగా జూన్ 12న జరగాల్సిన ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం జూన్ 23వ తేదీకి వాయిదాపడే అవకాశం ఉంది.

సమావేశం తేదీని ఖరారు చేయడానికి ముందు భావసారూప్యంగల అన్ని పార్టీల ఏకాభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా..బిజెపియేతర ప్రతిపక్షాలను ఒక దగ్గరకు చేర్చడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామాం ఎదురుదబ్బగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
రాహుల్ గాంధీ దేశంలో లేకపోవడమే సమావేశం వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పాట్నాలో సమావేశం జరపతలపెట్టడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తర్వాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీ నైతిక స్థయిర్యాన్ని పెంచింది. అంతేగాక లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కాంగ్రెస్ ముఖాముఖీ తలపడనుండడం కూడా కాంగ్రెస్‌కు కలసివచ్చే అంశంగా మారింది. ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించిన పక్షంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పాట్నాలో ప్రతిక్షాల ఐక్యతా సమావేశం జరగడం వల్ల ప్రతిపక్షాలకు నితీష్ కుమార్ సారథ్యం వహిస్తున్నారన్న సందేశం బయటకు వెళ్తే అవకాశం ఉందని, దీన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదని వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌తో సత్సంబంధాలు లేని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం పాట్నాలో జరగాలని ప్రతిపాదించారు. ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరిని టిఎంసిలో చేర్చుకోవడం కూడా ఆ రెండు పార్టీల మధ్య వైరాన్ని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News