హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించనున్నారు.
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇదే జాబితాతో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. 2023 అక్టోబర్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 సంవత్సరాలు నిండిన పౌరులను నూతన ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.