Wednesday, July 3, 2024

90 శాతం కాపీ పేస్ట్…ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు: ప్రతిపక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎన్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) భారతీయ సాక్ష అధినియమ్(బీఎస్‌ఏ) చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు లోకి వచ్చాయి. దీంతో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ) నేరశిక్షాస్మృతి (సిఆర్‌పిసి), భారత సాక్షాధార చట్టం కనుమరుగు కానున్నాయి. ఫలితంగా భారత న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అధికార పక్షం చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం కొత్త చట్టాలను బలవంతంగా అమలులోకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి.

146 మందిని సస్పెండ్ చేసి ఆమోదించారు: ఖర్గే
“ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోడీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారు. అయితే నేటి నుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం. కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్ న్యాయం’ ఆధిపత్యాన్ని ‘ఇండియా కూటమి’ ఆమోదించబోదు ”అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గత శీతాకాల సమావేశాలనుద్దేశించి ఖర్గే పై వ్యాఖ్యలు చేశారు. రెండు సభల్లో చాలామంది వివక్ష ఎంపీలను అప్పట్లో సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి సంబంధించి విపక్షాలు చేపట్టిన నిరసనల మధ్య అప్పటి సస్పెన్షన్‌లు కొనసాగాయి. ఆ సమయం లోనే కొత్త న్యాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందాయి.

సవరణలు చేస్తే సరిపోయేది: పి. చిదంబరం
మరోవైపు కొత్త న్యాయచట్టాల్లో 9099 శాతం పాత వాటి నుంచి కాపీ కొట్టారని సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో మెరుగులు దిద్దినప్పటికీ, వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందన్నారు. అయితే కొన్ని మార్పులు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని విషయాల్లో స్థాయి సంఘాలు సైతం తమ అభ్యంతరాలు తెలియజేశాయని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు, బార్ అసోసియేషన్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పలు వేదికలపై కొత్త చట్టాల్లోని లోపాలను ఎత్తి చూపినట్టు చెప్పారు. వీటిని రాజ్యాంగబద్దంగా అమలు చేసేందుకు దీర్ఘకాలంలో ఇంకా చాలా మార్పులు చేయాల్సి రావొచ్చని తెలిపారు.

క్రూరమైన చట్టాలు: తృణమూల్ కాంగ్రెస్
కొత్త చట్టాలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ రాజ్యాంగ విరుద్ధమైన , క్రూరమైనవిగా ఆరోపించారు. ఇండియా కూటమి నుంచి కొంతమంది వీటిపై పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశామన్నారు. చట్టాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సవివరమైన లేఖను కూడా అందించినట్టు వెల్లడించారు.

కొత్త చట్టాలపై అభ్యంతరాలు
నూతన చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీటి అమలును నిలిపి వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది. గత ఏడాది డిసెంబరులో ఈ చట్టాల బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్‌సభ , రాజ్యసభల నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, చర్చ జరపకుండానే బిల్లులను ఆమోదించారని పిటిషనర్లు అంజలీ పటేల్, ఛాయామిశ్రా పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలను సేకరించలేదన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News