బాదల్ ఆరోపణ.. ఆప్ ఖండన
చండీగఢ్: మద్యం సేవించినందుకు ఢిల్లీ వెళుతున్న విమానం నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో దింపివేశారంటూ సోమవారం ప్రతిపక్షాలు ఆరోపించగా ఇవి నిరాధార, తప్పుడు ఆరోపణలంటూ అధికార ఆప్ ఖండించింది. మద్యం సేవించి పూర్తి అపస్మారక స్థితిలో ఉన్న మాన్‌ను లుఫ్తాంసా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నుంచి దింపివేశారని శిరోమణి అకాలీ దళ్(ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. మద్యం సేవించి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను లుఫ్తాంసా విమానం నుంచి దించివేశారంటూ సహ ప్రయాణికులను ఉటంకిస్తూ వెలువడిన పత్రికా కథనాలు ఆందోళన కలిస్తున్నాయని, ఈ కారణంగా విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరిందని బాదల్ తెలిపారు. ఆప్ జాతీయ సదస్సుకు మాన్ హాజరుకాలేకపోయారని, ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా పంజాబీల పరువు తీశాయని బాదల్ ట్వీట్ చేశారు. కాగా..ఈ ఆరోపణలను నిరాధారమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి మాల్వీందర్ సింగ్ కంగ్ ఖండించారు. ముఖ్యమంత్రిని అప్రతిష్టపాల్జేయడానికి ఇటువంటి విష ప్రచారానికి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు.విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎనిమిది రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లిన మాన్ సోమవారం తిరిగి వచ్చారు.