Monday, January 20, 2025

ఆర్థికం కాదు, సామాజికమే!

- Advertisement -
- Advertisement -

బంధాలు బలపడుతున్నాయి. ఇష్టావిలాస పాలనతో దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్ష వేదిక నిర్మాణం వేగం పుంజుకొంటున్నది. ఈ దిశగా మరొక ముఖ్యమైన ఘట్టం ఢిల్లీ, చెన్నైలు వేదికగా సోమవారం నాడు చోటు చేసుకొన్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చొరవతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్య పద్ధతిలో జరిగిన ఈ సమావేశం సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించిన చర్చను లోతులకు తీసుకు వెళ్ళింది. భారత రాజ్యాంగం దేశ ప్రజల వెనుకబాటుతనాన్ని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో నుంచి చూసి దానిని ప్రధానంగా సామాజిక, విద్యాపరమైనదిగా గుర్తించింది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ఉన్నత విద్యలోనూ 27% రిజర్వేషన్లు కల్పించారు. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బిజెపి మందిర్ ఆందోళనను రెచ్చగొట్టి ఒబిసిలకు తీవ్రమైన అన్యాయం చేసింది.

కులపరమైన అణచివేతపై దేశ జనాభాలో అత్యధికంగా వున్న ఒబిసిల్లో చైతన్యం కలిగితే అగ్ర వర్ణ ఆధిపత్యానికి ముప్పు తప్పదని భావించి బిజెపి బాబ్రీ మసీదు కూల్చివేత వైపు జన సమీకరణ చేసింది. ఇందులో ఉత్తరాదిలోని ఒబిసిలే ఎక్కువగా పాల్గొనడం ఒక విచిత్ర విషాద ఘట్టం. అయితే మండల్ ఉద్యమం నుంచి ఉత్తర భారతంలో బలమైన ఒబిసి నాయకత్వం రూపొందిన మాట కూడా వాస్తవమే. ముస్లింలను శత్రువులుగా చూపించి హిందూ ఐక్యతను సాధించడం కోసం బిజెపి హిందూ మతంలోని అణగారిన వర్గాలను దువ్విన మాట కూడా నిజం. సమ్మిళిత హిందూత్వను సాధించాలనే బిజెపి యజ్ఞానికి సమిధలైన వారు ఒబిసిలే. జనసంఘ్ కాలంలో నామమాత్రంగా వున్న ఈ కాషాయ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకొనే స్థాయికి ఎదగడానికి ఈ సమ్మిళిత హిందూత్వ దానికి బాగా ఉపయోగపడింది. ఆ కాడి మోసిన ఒబిసిల పరిస్థితి మాత్రం మారలేదు. మండల్ ఉద్యమం నేపథ్యంలో ఎదిగి వచ్చిన ఒబిసి నాయకత్వం సామాజిక న్యాయ సాధనను ప్రధాన లక్షంగా చేసుకొన్నది.

సోమవారం నాడు సమావేశమైన ప్రతిపక్షాలు దీనినే ముఖ్యాంశంగా చేసుకొని చర్చించడం గమనించవలసిన విషయం. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం స్థానంలో ఆర్థిక వెనుకబాటు తనాన్ని అనగా అగ్ర వర్ణాల్లోని వెనుకబడిన తనాన్ని రూపుమాపే లక్షాన్ని ముందుకు తీసుకు వచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా వారికి 10% రిజర్వేషన్లు కల్పించారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని తిరిగి నెలకొల్పే మహత్తర ఆశయంతో ప్రతిపక్షాలు సమావేశం కావడాన్ని అతి పెద్ద పురోగామి చర్యగా పరిగణించవలసి వుంది. జరగవలసింది ఆర్థిక న్యాయం కాదని, కేవలం సామాజిక న్యాయమేనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బల్లగుద్ది చెప్పారు. పేదలు అన్ని వర్గాల్లోనూ వుంటారని, వారికి ఆర్థిక సాయం అందించడంలో తప్పులేదని అంటూనే ప్రత్యేకించి అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం సామాజిక అన్యాయమేనని చెప్పడం ద్వారా తాము ఏ ప్రజల కోసం పాటుపడదలచామో స్టాలిన్ స్పష్టం చేశారు.

భారతీయ జనతా పార్టీ హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ రాజకీయాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోడమే తమ ఉద్దేశమని చాటారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ తరపున మాట్లాడిన దాని పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు సమాజంలో మెజారిటీ జనాభాగా వున్న ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల చేతికి అధికారం చిక్కకపోడాన్ని ప్రశ్నించి అసలు సమస్యను ముందుకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా కులాలవారీ జన గణనను చేపట్టాలని ఈ సమావేశానికి హాజరైన ప్రతిపక్షాలన్నీ ఐక్య కంఠంతో డిమాండ్ చేయడం విశేషం. బిఆర్‌ఎస్, డిఎంకె, కాంగ్రెస్, ఆర్‌జెడి, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఉభయ వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్‌సిపి, ఐయుఎంఎల్, ఎండిఎంకె తదితర పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. కుల గణన అనేది అత్యంత కీలకమైన అంశం. గతంలో 1931లో బ్రిటీష్ హయాంలో చిట్టచివరి కులాల వారీ జన గణన జరిగింది.

దేశ జనాభాలో ఒబిసిలు 52 శాతమని అందులో తేలింది. అప్పటి నుంచి కులాల వారీ జన గణన జరగలేదు. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదితరులు కుల గణన జరిపించాలని కోరినా ప్రధాని మోడీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటూ తిరస్కరించింది. వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు తదితర ప్రయోజనాలను కల్పించాలంటే దేశ జనాభాలో ఏ కులస్థులు ఎంత మంది వున్నారో తెలుసుకోవలసిన అవసరముంది. కాని కులాల జనాభా లెక్కలు తీస్తే సామాజిక, ఆర్థిక తారతమ్యాలు బయటపడి వివిధ కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని తాము కృత్రిమంగా నిర్మించిన సమ్మిళిత హిందూత భవనం కూలిపోతుందని బిజెపి భయపడుతున్నది. సరిగ్గా దానినే డిమాండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాలు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రధాన ఎజెండాను సిద్ధం చేసుకొంటున్నాయి. ఇది ఎంతైనా హర్షించవలసిన పరిణామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News