న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్‌ది ఒకే విధమైన ఎజెండా అని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ సోదరులను పంజాబ్‌కు రానివ్వొద్దని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పడాన్ని కూడా మోడీ ఖండించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా మోడీ విరుచుకుపడ్డారు. మిమ్మల్ని ఢిల్లీకి రానివ్వనివారు, ఇప్పుడు పంజాబ్‌కు వచ్చి మీ ఓట్లు కోరుతున్నారని ఎద్దేవా చేశారు. అమరులైన సైనికుల త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందని, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారిని సంస్మరించుకునే సమయంలో కూడా కాంగ్రెస్ ఇదే వైఖరి ప్రదర్శించిందన్నారు.
బీజేపీ ప్రభుత్వ పథకాల వల్ల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు , చికిత్స అందరికీ అందుబాటు లోకి వచ్చినట్టు తెలిపారు. పంజాబ్‌లో మాఫియా పాలనను కేవలం బీజేపీ మాత్రమే మార్చగలదని చెప్పారు. పీఎంకిసాన్ పథకం వల్ల రైతులు లబ్ధి పొందుతారన్నారు. నూతన దార్శనికతతో కూడిన ప్రభుత్వం పంజాబ్‌కు అవసరమని , మొదటిసారి ఓటు వేస్తున్న యువత గొప్పమార్పు తీసుకురాగలదని చెప్పారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా మోడీ గురువారం అభోర్‌లో జరిగిన సభలో మాట్లాడారు.