Sunday, January 19, 2025

ముంబై ఇండియాపై అందరి దృష్టి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీన ముంబైలో జరిగే మూడో ప్రతిపక్ష భేటీపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతం అయింది. ఇండియా కూటమి ఎట్టకేలకు ముంబైలో రెండు రోజుల సమావేశాన్ని ఖరారు చేసుకుంది. ఈ భేటీ సందర్భంగానే ఇండియా కూటమి లోగో, 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్ల విషయాలపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు వెల్లడైన అజెండాతో ఈ విషయాలు స్పష్టం అయ్యాయి. ప్రతిపక్షాలు సంఘటితంగా ఒకే చిహ్నంపై ప్రజల్లోకి వెళ్లడం, అత్యంత జటిలమైన సీట్ల సర్దుబాట్లకు దిగడం ముంబై భేటీలో ప్రధానాంశాలు అవుతాయని అజెండాతో స్పష్టం అయింది. ఇండియా కూటమిలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఈ కూటమిలోకి మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరుతాయని భావిస్తున్నారు. బిజెపి శివసేన ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఎన్‌సిపి చీలికల రాష్ట్రంలో ప్రతిపక్ష భేటీ జరగడం ప్రధాన విషయంగా మారింది.

ఇండియా కూటమిలో మరికొన్ని పార్టీలు వచ్చి చేరుతాయని జెడియు నేత, ప్రతిపక్ష ఐక్యతకు నడుంబిగించిన నితీశ్ కుమార్ పాట్నాలో తెలిపారు. పాట్నాలో తొలిసారి ప్రతిపక్ష భేటీ జరిగేలా చేయడంలో నితీశ్ కీలక పాత్ర పోషించారు. తరువాత కాంగ్రెస్ ప్రాబల్య కర్నాటకలో రెండో భేటీ జరిగింది. ఇప్పుడు ముంబై వేదిక అవుతోంది. కొత్తగా ఏఏ పార్టీలు ఇండియా కూటమిలో చేరుతాయనే విషయాన్ని నితీశ్ వివరించలేదు. దీని గురించి ముంబైలో చెప్పడం జరుగుతుందని, అక్కడ సీట్ల సర్దుబాట్లు, ఎన్నికలకు సమాయత్తం గురించి చర్చించుకుంటామని జెడియు నేత తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరగుతుంది. తన ప్రాధాన్యతకు ఎటువంటి అజెండాలేదని, బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సంఘటితం చేయడమే తమ ముందున్న ఆలోచన అని నితీశ్ తెలిపారు. ఈశాన్య భారతం నుంచి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందని, ముంబై భేటీకి బాధ్యత వహించిన ఉద్ధవ్ థాకరే శివసేన నేత సంజయ్ రౌత్ ముంబైలో తెలిపారు.

ముంబై శివార్లలోని గ్రాండ్ హ్యాత్ లగ్టరీ హోటల్‌లో ఇండియా సమావేశం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తారని వివరించారు. కాగా కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా పలు రాష్ట్రాలలో సీట్ల సర్దుబాట్లు జరిగాయని, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి జాప్యం జరుగుతోందని అంగీకరించారు. ఈ భేటీ విజయవంతానికి ఎన్‌సిపి నేత శరద్ పవార్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. శివసేన (యుబిటి), ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు ఈ సమావేశ నిర్వహణ విషయాలను ఖరారు చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశాయి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతల చొప్పున కమిటీల రూపకల్పన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News