ఆర్థికమంత్రి భట్టి విక్రమార్కపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
స్పీకర్ అనుమతి కోరాం రూ. 3.89లక్షల కోట్ల అప్పు అయితే
రూ.7లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్పారు అసలైన అప్పులతో
సవరణ స్టేట్మెంట్ ఇవ్వాలి లగచర్ల అంశాన్ని చర్చకు తీసుకురావాలి
అసెంబ్లీ లాబీలో కెటిఆర్ చిట్‌చాట్ ప్లకార్డులతో బిఆర్ఎస్ నిరసన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బిఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి భట్టి విక్రమర్కపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌శ్రీ కె.టి.రామారావు తెలిపారు. తెలంగాణ అప్పులపైన శాశనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన అనంతరం సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో కెటిఆర్ చిట్ చాట్ చేశారు. మాట్లాడారు. ప్రోటోకాల్ సమస్యలను స్పీకర్‌కు వివరించామని, లగచర్లపై చర్చకు తాము సభాపతిని అడిగామని, బిఎసిలో కూడా ఈ అంశాన్ని లెవనెత్తుతామని చెప్పారు.అర్బిఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం
3.89 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పులపై ఆర్ధిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందని వెల్లడించారు. 2014— -15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72,658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించిందన్నారు. ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. కాబట్టి తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బిఆర్ఎస్ శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎంఎల్ఎల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, ఈ అంశంలోనూ సభ హక్కుల నోటీసు ఇచ్చామని తెలిపారు. లగచర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, టూరిజంపైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అడ్డం పడుతుందని వ్యాఖ్యానించారు.
అసలైన అప్పులతో సవరణ
స్టేట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అసలైన అప్పులతో సవరణ స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వాలని, లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సభను ప్రవేశపెట్టాలని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో తానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ స్పీకర్ మనోహర్ అంగీకరించారని, ఆ సందర్భంగా సభలో చర్చ కూడా జరిగిందని తెలిపారు.
ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి
రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి వందకు పైగా చేసిన పర్యటనలతో ఢిల్లీ టూరిజం బాగా పెరిగిందన్నారు. మరోవైపు 40 మంది లగచర్ల రైతులను జైలులో పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మొదలుకొని పార్టీ నాయకులను జైల్లో పెడుతున్న జైలు టూరిజం… బెయిల్ వచ్చిన తర్వాత కూడా నటులను జైలులో ఉంచుతున్న జైలు టూరిజం… ప్రభుత్వ పథకాల పైన మాట్లాడుతుంటే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి చేస్తు న్న జైలు టూరిజం.. ఈ విధంగా తెలంగాణలో జైలు టూరిజం బాగా నడుస్తుందని పేర్కొన్నారు.
లగచర్ల అంశాన్ని చర్చకు తీసుకు
రావాలని స్పీకర్‌ను కోరాం
సర్పంచుల సమస్యలను కూడా శాసనసభలో లేవనెత్తామని కెటిఆర్ చెప్పారు. వారికి ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్ల రూపాయలు గత నెలలు ఇచ్చిన నిధుల్లో సగం ఇస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియశామని పేర్కొన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్జప్తి చేశామన్నారు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎంఎల్ఎలను, శాసనసభ వైపు రాకుండా చేసిన తీరుపైన కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎంఎల్ఎలు వచ్చి అందరూ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటున్నదని అన్నారు. అయితే గతంలో ఇదే శాసనసభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాల వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకువచ్చి నిరసన తెలిపిన అంశాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం శాసనసభలో మమ్మల్ని కట్టడి చేసి ప్రభుత్వ వైఫల్యాలను దాచుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
సభలో ప్రశ్నిస్తామనే భట్టి బయట
ప్రకటన చేశారు
రైతు కూలీలకు 12 వేల అర్ధిక సహాయం అందిస్తామంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహరాలకు వ్యతిరేకం అని కెటిఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి మర్చిపోయారన్నారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన భట్టి, శాశనసభ బయట ప్రకటన చేయడంపై కెటిఅర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ ప్రకటన చేస్తే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదని, అందుకే బయట ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.