న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్ అంశం పై మాట్లాడేందుకు కేంద్ర సమాచార, సాంకేతిక మం త్రి అశ్విని వైష్ణవ్ లేచి నిలబడగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపి శంతను సేన్ ఆయన చేతిలోని పేపర్లను లాక్కుని చించేశారు. వాటిని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పైకి విసిరేశారు. దీంతో అశ్విని వైష్ణవ్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా శంతను సేన్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌పురి మధ్య వాగ్వాదం జరిగింది. తృణమూల్ ఎంపి ప్రవర్తన పట్ల హరివంశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభ్యులు ఇలాంటి సభా మర్యాదలవ్యతిరేక ప్రవర్తనను మానుకోవాలని హితవు చెప్పారు. విపక్షాల ఆందోళన మధ్య సభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకు ముందు రాజ్యసభ వరసగా మూడుసార్లు వాయిదా పడింది. మొద ట మధ్యాహ్నం 12గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఐటి మంత్రి వైఖరిని ఆర్‌జెడినేత మనో జ్ ఝా తప్పుబట్టారు. సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నడుమ మంత్రి ప్రకటన చేయడం చూస్తే ప్రభుత్వం ఈ సమస్యను అపహాస్యం చేయాలనుకుంటున్నట్లుగా ఉం దని ఆయన దుయ్యబట్టారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు పెగాసస్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలంటూ టిఎంసి ఎంపిలు పోడియాన్ని చుట్టుముట్టారు. మీడియా సంస్థలపై గురువారం జరిగిన ఐటి దాడుల అంశాన్ని దిగ్విజయ్ లేవనెత్తారు. ఏ అంశంపై చర్చించాలన్నా ముందుగా తన అనుమతి తీసుకోవాల్సి ఉం టుందని దిగ్విజయ్‌కు చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
లోక్‌సభలోనూ అదే సీన్
లోక్‌సభలోనూ రాజ్యసభ దృశ్యాలే పునరావృతమైనా యి. సభ ప్రారంభం కాగానే విపక్షాలకు చెందిన సభ్యు లు నూతన వ్యవసాయ చట్టాలతో సహా వివిధ అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి ప్రాంభమైనప్పుడు కూడా విపక్ష సభ్యులు నినాదాలు అపలేదు. సభా స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్ సభ్యులను తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని కోరినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.
టిఎంసి ఎంపిలపై సభా హక్కుల తీర్మానం
కాగా గురువారం రాజ్యసభలో గందరగోళం సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపిల చర్యలపై కేంద్ర ప్రభుత్వం సభా హక్కుల తీర్మానం తీసుకురానున్నది. అలాగే మంత్రి చేతిలో పేపర్లు లాక్కుని చించేసిన ఆ పార్టీ ఎంపి శంతను సేన్‌ను సభనుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మంత్రి నాపై దాడి చేయబోయారు: శంతను సేన్
రాజ్యసభలో మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తనను నిందించడమే కాకుండా కొట్ట బోయారని, అయితే తన పార్టీకి చెందిన సహచరులు అడ్డుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి శంతను సేన్ ఆరోపించారు. సభలో గురువారం కేంద్ర సమాచార, ఐటి శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేయడానికి లేచి నిలబడగా శంతను సేన్ ఆయన చేతిలోని పేపర్లను లొక్కొని చించేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పురికి, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. సభ వాయిదా పడిన తర్వాత శంతను సేన్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి తనను దూషించడమే కాకుండా కొట్టడానికి సిద్ధమైనారని ఆరోపించారు. అయితే తన పార్టీ సహచరులు తనను కాపాడారని ఆయన చెప్పారు. మంత్రి ఉరిమి చూస్తూ తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.
OPPosition concerns on Pegasus in Parliament